20-09-2025 08:43:24 PM
హన్మకొండ,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు, నేటి నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చేపట్టిన సమ్మెను విరమించడం ద్వారా వేలాది మంది పేద రోగులకు మళ్లీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిణామానికి ప్రధాన కారకుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాత్ర కీలకంగా నిలిచింది.
ప్రభుత్వానికి, హాస్పిటల్స్ యాజమాన్యాలకు వారధిగా నాయిని
ఆరోగ్య శ్రీ బకాయిలు, విధానాలపై ఏర్పడిన విభేదాలతో, ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయగా, ఆ కొరత తీవ్రంగా ప్రజలను వేధించింది. ఈ సమయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మూడు రోజులుగా నిరంతరం కృషి చేస్తూ, ప్రభుత్వానికి మరియు హాస్పిటల్స్ యాజమాన్యానికి మధ్య వారధిగా వ్యవహరించారు.
వారు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపారు. వైద్యుల సమస్యలు, ఆసుపత్రుల ఆందోళనలు మనస్పూర్తిగా వినిపించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తో నేరుగా చర్చలు జరిపి, ఫోన్ ద్వారా అనేక సమన్వయాలు చేసి, సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి స్పష్టతనిచ్చారు.
ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి ప్రారంభం
ఈ చర్చల అనంతరం, నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించేందుకు సిద్ధమయ్యాయి. నేటి నుంచి అన్ని ఆరోగ్య శ్రీ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో మళ్లీ ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.