25-10-2025 08:32:37 PM
వరంగల్,(విజయక్రాంతి): యాసంగి రైతుల వరి ధాన్యం బోనస్ డబ్బులను తక్షణమే రైతులకు అందించాలని అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. శనివారం మొక్కజొన్న, వరి, పత్తి పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయాలనీ రైతులతో కలిసి వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ... ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యి మూడు నెలలు కావస్తున్నప్పటికీ, ముందస్తు వ్యవసాయ ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్ల, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత యాసంగి సీజన్లో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యంను కొనుగోలు చేసిన ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి నాలుగు నెలలు దాటిన నేటి వరకు రైతులకు చెల్లించలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 1168 కోట్లు రూపాయల బోనస్ డబ్బులను లక్షలాది మంది రైతులకు ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే రైతులు అష్ట కష్టాలు పడి మొక్కజొన్న, పత్తి పండిస్తే మార్కెట్లో దళారులు, వ్యాపారులు మద్దతు ధర కన్న అతి తక్కువధరకు కొనుగోలు చేసి నిండ ముంచుతున్నారన్నారు.
ప్రభుత్వం మొక్కజొన్న, పత్తి, వరి కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వలన రైతు వద్ద అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన పంటలను దళారులు కొనుగోలు కేంద్రాల్లో తప్పుడు పద్దతులలో విక్రయించి కోట్లు గడిస్తున్నారని, దీనివలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కావున తక్షణమే సకాలంలో రైతులకు పంటల దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మద్దతు ధరకన్న తక్కువకు కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు చేపట్టాలని, యాసంగి వరిధాన్యం బోనస్ బకాయిలను తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగతి మల్లికార్జున్, జి. రామారావు,మంద రవి,అరుణ్ నాయక్,సాగర్, ముక్కెర రామస్వామి, అశోక్, ఓదేలు, కుమారస్వామి, జగదీశ్వర్, కలకోట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.