10-05-2025 01:09:54 AM
జగిత్యాల, మే 09 (విజయక్రాంతి): జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోల్లు సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస, బాలపెల్లి పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్పలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని, ప్రతిరోజు మిల్లులకు పంపుతున్నామ న్నారు. రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే కాంటా వేసి కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హమాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జగిత్యాల రూరల్ మండల తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు