calender_icon.png 11 May, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

10-05-2025 01:11:32 AM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల అర్బన్, మే 09 (విజయక్రాంతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం   చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు.

భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో  భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ, గంగాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు లో  పాల్గొని రైతులతో మాట్లాడారు.  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.

పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు మండలం లో రెండు టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బుగ్గారం మండల  తహసిల్దార్ ఆధ్వర్యంలో గంగాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్థారని,  ధర్మపురి తహసిల్దార్ ఆధ్వర్యంలో వెల్గొండ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

రైతులకు పెండింగ్లో ఉన్న  భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈరోజు కాకుండా రేపు కూడా అధికారులకు అందించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, బుగ్గారం తహసిల్దార్ మజీద్,  ధర్మపురి తహసిల్దార్ కృష్ణ చైతన్య, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు

భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భూ భారతి రెవిన్యూ చట్టం, 2025 (భూమి హక్కుల రికార్డు)ను తీసుకొచ్చిందని, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5000 మంది లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  ఒక ప్రకటనలో తెలిపారు.

రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఈ లైసెనస్డ్ సర్వేయర్లను జిల్లాల్లో నియమిస్తారని తెలిపారు. సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే నోటిఫికేషన్ ప్రచురించిందని తెలిపారు.

05.05.2025 నుండి 17.05.2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుందని పేర్కొన్నారు. 26.05.2025 నుండి 26.07.2025 వరకు (50 పని దినాలు) శిక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా సర్వే, ల్యాండ్ రికారడ్స్ అధికారి సహాయంతో ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సర్వేయర్ల శిక్షణను అత్యంత జాగ్రత్తగా నిర్వహించనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.