calender_icon.png 9 October, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరిగింజ వరకు ధాన్యం సేకరించాలి

09-10-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  చివరి గింజ వరకు ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలను ఆదేశించారు.

వానాకాలం 2025-26  సీజన్ కి సంబంధించి ధాన్యం కొనుగోలుపై బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశం మందిరంలో ఐకెపి, పిఎసిఎస్, ఎఫ్ పి ఓ, మెప్మా  శాఖలకు చెందిన కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 158, పి ఏ సి ఎస్ ద్వారా 122, ఎఫ్ పి ఓ ద్వారా 15, మెప్మా ద్వారా 13 మొత్తం 308 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

కొనుగోలు కేంద్రాలను వారం రోజుల్లో  ప్రారంభించాలని ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతంలో ఉండకుండా ఎత్తున ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలని ప్రతి కేంద్రంలో వేయింగ్ మిషన్, విద్యుత్, త్రాగునీరు, ప్లెక్సీపై నిర్వాహకుల పేరు, ఫోన్ నెంబర్, టార్పాలిన్ పట్టాలు, పాడి క్లీనర్లు, డ్రైయర్లు, ట్యాబ్ లాంటి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.

రైతులు కొనుగోలు కేంద్రాలకు గడ్డి,తాలు, దుమ్ము లేకుండా  నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. ఐ కే పి, పి ఏ సి ఎస్ , మార్కెటింగ్, మెప్మా శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ  జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  ధాన్యం కొనుగోలు చేసి విజయవంతం చేయాలన్నారు.  గ్రేడ్ ఎ ధాన్యం రకానికి రూపాయలు 2389, కామన్  రకానికి చెందిన ధాన్యానికి రూపాయలు 2369 మద్దతు ధర ఇస్తుందన్నారు.

అలాగే  సన్న రకం వడ్లకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్   కల్పిస్తుంది కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డిఆర్డిఏ పిడి వివి అప్పారావు, డిఎస్‌ఓ మోహన్ బాబు, డిఎం రాము, డి సి ఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, రవాణా అధికారి జయప్రకాశ్ రెడ్డి, ఐకెపి,పి ఎస్ ఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.