calender_icon.png 9 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిశంకు స్వర్గం!

09-10-2025 01:24:09 AM

డోలాయమానంలో గ్రూప్-1 అభ్యర్థులు

ఉద్యోగం వస్తుందా.. లేదా? అని కొందరు.. 

ఉద్యోగం ఉంటుందా.. పోతుందా? అని నియామకపత్రాలు పొందిన ఉద్యోగులు

ఇరువర్గాల్లో తీవ్ర ఆందోళన 

తుది తీర్పుకు లోబడే నియామకాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 

ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వం 

  15న హైకోర్టులో కేసు విచారణ

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గ్రూప్-1కు ఎంపికకాని అభ్యర్థులు, ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకున్న గ్రూప్-1 ఉద్యో గులు త్రిశంకు స్వర్గంలో ఉన్న పరిస్థితి నెలకొన్నది. తమకు ఉద్యోగం వస్తుందని కొందరు భావిస్తుంటే.. తమ ఉద్యోగాలు ఉంటయా? లేక ఊడుతాయా? అని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకున్న మరికొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గ్రూప్-1 నియామకాలను నిలిపివేయా లని కొందరు గ్రూప్-1 అభ్యర్థులు ఇటీవల వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం డిస్పోజ్ చేయడంతో హమ్మయ్య అని ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నా, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పుకు లోబడే వారి నియామకాలు ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టం చేయడం గమనార్హం.

అంటే అపాయింట్‌మెంట్‌లు తీసుకున్నా ఉద్యోగాలు ఉండొచ్చు.. లేకుంటే ఊడొచ్చునని అభ్యర్థులు చెబుతున్నారు. ఉద్యోగాలు రానివారు, ఉద్యోగాలు వచ్చినవారు.. ఇలా రెండు వర్గాలుగా చీలిపోయిన గ్రూప్-1 అభ్యర్థులు ఎవరికి వారు తమకే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. కానీ, న్యాయస్థానాలు వెలువరించే తీర్పును బట్టే ఎవరికి ఉద్యోగాలొస్తాయి? ఎవరికి పోతాయి? అనేది స్పష్టమవుతుందని అంతా భావిస్తున్నారు.

నష్టపోతున్న అభ్యర్థులు..

దాదాపు 14 ఏళ్ల తర్వాత గ్రూప్ నియామకాలు జరుగుతున్నాయి. అయితే తొలి నుంచి ఈ నియామకాల ప్రక్రియ వివాదాల చుట్టే తిరుగుతోంది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభ్య ర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2022 ఏప్రిల్ 26న 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమి నరీ పరీక్షలు నిర్వహించగా, 2023 ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.

ఈలోగా గ్రూప్1తోపాటు పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్1 పరీక్షను టీజీపీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11న మరోసారి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షను పార దర్శకంగా నిర్వహించలేదని, లోపాలు జరిగాయ ని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పుడు కూడా ఆ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువడింది.

ఆతర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయడంతో పాటు 503 పోస్టులకు గానూ మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను వేసింది. 2024 జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 10న అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేయగా, మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది.

అదేవిధంగా ఏప్రిల్ 10న 563 ఉద్యోగాలకు ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థుల తుది జాబితా ను విడుదల చేసి ధ్రువపత్రాల పరిశీలనను కూడా చేపట్టింది. అయితే మెయిన్ పరీక్షల్లో అవకతవకులు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో గ్రూప్ మెయిన్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది.

అంతేకాకుండా జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయాలని లేదా తిరిగి మెయిన్స్ పరీక్షను ఎనిమిది నెలల్లోగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయి తే దీనిపై గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన కొం దరు అభ్యర్థులు, టీజీపీఎస్సీ.. హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లడంతో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

అయితే ప్రభుత్వం నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పుకు లోబడి ఉంటాయని కూడా చెప్పడం గమనార్హం. దీంతో ఉద్యోగాలకు ఎంపిక కాని కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను కోర్టు మంగళవారం డిస్పోజ్ చేసింది.

మళ్లీ సుప్రీంకు వెళ్లే ఆలోచన..!

టీజీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేయడంతో సెప్టెంబర్ 27న వారికి నియామకపత్రాలను రాష్ట్ర ప్రభు త్వం అందజేసింది. 562 మందికి సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. నియమాకపత్రాలు పొందిన వారి లో కొందరు డిప్యూటీ కలెక్టర్లు, ఎక్సైజ్ డీఎస్పీలు, ఇతర పోస్టులకు చెందినవారూ ఉన్నారు. చాలా మంది ఇప్పటికే తమ తమ ఉద్యోగాల్లో చేరారు కూడా.

అయితే కోర్టు తుది తీర్పుకు లోబడే మీ ఉద్యోగాలుంటాయని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థుల నుంచి అధికారులు డిక్లరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఒకవేళ వీరికి అనుకూలంగా డివిజన్ బెంచ్ తీర్పు వస్తే వీరి ఉద్యోగాలకు భద్రత ఉంటుంది. లేకుంటే వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు.

అదే విధంగా గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు రాకపోతే వారు సైతం సుప్రీం కోర్టును మళ్లీ అశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నట్లు ఓ అభ్యర్థి తెలిపారు. చివరికి ఈ అంశం సుప్రీంకు చేరనుందని ఆయన పేర్కొన్నారు. ఎవరికి న్యాయం జరగకున్నా ఇది ఇలాగే సాగుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఈనెల 15న హైకోర్టు తీర్పుతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.