28-01-2026 12:19:23 AM
14 వేల మంది పోలీసులతో బందోబస్తు
ఏఐ టెక్నాలజీతో రద్దీ నియంత్రణ
20 డ్రోన్ కెమెరాల వినియోగం
జంపన్నవాగులో 348 బ్యాటరీ ట్యాప్స్
119 డ్రెస్సింగ్ రూమ్‌లు, 5,700 మరుగుదొడ్ల ఏర్పాటు
5 వేల మంది వైద్యులు, 108 అంబులెన్సులు, 35 మొబైల్ అంబులెన్సులతో వైద్య సేవలు
మేడారం, జనవరి 27 (విజయక్రాంతి): మేడారం మహా జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రూ.251 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. ఇందులో రూ.101 కోట్లతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని రాతిశిలా ప్రాకారాలతో నిర్మించింది. వివిధ శాఖలను బలోపేతం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వనదేవతలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. 14 వేల మంది పోలీసులు జాతర బందోబస్తు నిర్వహణలో పాల్గొంటున్నారు.
ఇద్దరు డీఐజీలతో పాటు 20 మంది ఎస్పీ స్థాయి, 50 మంది ఏఎస్పీలు, 150 మంది డీఎస్పీలు, 400 మంది ఇన్‌స్పెక్టర్లు, 900 మంది స్పెషల్ ఇన్‌స్పెక్టర్లు, వెయ్యి మంది ఎస్సైలు, అదనంగా 500 మంది ప్రత్యేక పోలీసు బృందంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతోపాటు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈసారి ప్రత్యేకంగా పోలీసు శాఖ ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రత్యేకంగా 20 డ్రోన్ కెమెరాలను, జాతరలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
దొంగలను, పాత నేరస్తుల కదలికలను గుర్తించడానికి ఫేస్ రికగ్నైసేడ్ సిస్టం వినియోగిస్తున్నారు. భక్తులు తప్పిపోకుండా క్యూఆర్ కోడ్ వృష్ట బ్యాండ్ ట్రాకింగ్ సిస్టం అమలు చేస్తున్నారు. తోపులాటలు జరగకుండా మేడారం నలువైపులా నాలుగు వరుసల రహదారులను విస్తరించారు. భక్తులు ఎక్కువగా గుమిగూడే జంక్షన్‌లను విస్తరించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలు ఈసారి రోడ్లను విస్తరించి 35 చోట్ల 1,500 ఎకరాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.
జంపన్న వాగులో భారీ ఏర్పాట్లు
జంపన్నవాగులో భక్తులు స్నానం ఆచరించడానికి 348 బ్యాటరీ టాప్స్ ఏర్పాటు చేశారు. రెడ్డిగూడెం నుంచి చిలకల గట్టు వరకు జంపన్న వాగుకు ఇరువైపులా భక్తులు దుస్తులు మార్చుకోవడానికి 119 డ్రెస్సింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే 5,700 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో భక్తులు ప్రమాదవశాత్తు మునిగిపోతే వారిని కాపాడేందుకు ప్రత్యేక గజ ఈతగాళ్లతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను నియమించారు.
పారిశుద్ధ్య నిర్వహణ
మేడారం జాతరలో పారిశుధ్య నిర్వహణ కోసం 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. 21 మంది జిల్లా పంచాయతీ అధికారులు, 42 మంది డివిజనల్ పంచాయతీ అధికారులు, 83 మంది పంచాయతీ అధికారులు, 480 మంది పంచాయతీ కార్యదర్శులతో పాటు 9 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది మేడారం జాతర విధుల్లో పనిచేస్తున్నారు. మూడు షిఫ్టుల వారిగా 24 గంటల పాటు వీరు విధులు నిర్వహిస్తారు.
తాగునీటి వసతి
మేడారంలో 517 బ్యాటరీ టాప్స్ ఏర్పాటు చేశారు. 47 నీటి గుమ్ములు, 10 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిరంతరం నీటి సరఫరా కోసం హై కెపాసిటీ బోర్వెల్స్ ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ సేవలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులను మేడారం తీసుకువచ్చి తిరిగి తీసుకువెళ్లడానికి 4వేల బస్సులను ప్రత్యేకంగా ఆర్టీసీ నడుపుతోంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. 51 వేల ట్రిప్పుల్లో బస్సులు నడిపి 30 లక్షల మంది ప్రయాణికులను మేడారం చేర్చాలని లక్ష్యంతో కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం 10,400 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మార్గమధ్యంలో అంతరాయం కలగకుండా బస్సులు నిరంతరం నడపడానికి ప్రత్యేకంగా మెకానికల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మేడారం జాతరలో 50 ఎకరాల్లో అతిపెద్ద బస్టాండ్ ఏర్పాటు చేశారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
మేడారం జాతరలో అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరాలో అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నాలుగు వేర్వేరు మార్గాల నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో విద్యుత్ పనుల పర్యవేక్షణ, ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లోడ్ పరిశీలన చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో 106 ట్రాన్స్‌ఫార్మర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. మేడారం జాతరలో విధులు నిర్వహించే సిబ్బందికి ఎన్పీడీసీఎల్ లోగో టీషర్టుల పంపిణీ చేశారు.
132 కేవీ కమలాపూర్, పస్రా, ములుగు నుంచి వచ్చే 33 కేవీ నాలుగు వేర్వేరు మార్గాల నుంచి ప్రత్యామ్నాయ సరఫరా కోసం డీపీ స్ట్రక్చర్‌తో కూడిన 8 పోల్ వ్యవస్థను పర్యవేక్షించారు. 106 ట్రాన్స్‌ఫార్మర్లను నేరుగా సబ్ స్టేషన్ నుంచి మానిటర్ చేసేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేశామని, దీని ద్వారా సమస్యను తక్షణమే గుర్తించి సరిచేయవచ్చని తెలిపారు. జాతర విధుల్లో ఉండే సిబ్బంది కోసం 55 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి 600 మంది సిబ్బందిని నియమించారు. వీరందరికి అన్ని వసతులు ఏర్పాటు చేశామని 70 టెంట్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.
వైద్య సేవలు
మేడారంలో భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. అలాగే మరో రెండు చోట్ల 6 బెడ్ల మినీ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. 30 చోట్ల వైద్య క్యాంపులు ఏర్పాటు చేశారు. 5వేల మందికి పైగా వైద్యులు సిబ్బంది మేడారం జాతరలో భక్తులకు సేవలు అందిస్తారు. 108 అంబులెన్సులు 35, మొబైల్ అంబులెన్సులు భక్తులకు అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచారు.