calender_icon.png 12 October, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్యం జాగాలో సమాధులు!

11-10-2025 01:11:13 AM

వివాదంలో షేక్‌పేట్ మిలటరీ స్థలం 

ప్రభుత్వ జీవోపై నిరసనలు

* కబ్జాకోరులు స్మశానాలనూ వదలరు.. దున్నేస్తారు! పక్కవాడి స్థలం అయితే ఆక్రమిస్తారు. కాదు, కూడదంటే ఒకదేశం మకోదేశంపై దండెత్తినట్టు యుద్ధానికి వస్తారు.. అయితే ఒక స్థలం ప్రభుత్వ కనుసన్నల్లోనే ఆక్రమణకు గురైతే ఎలా ఉంటుంది.? అందున ఆ స్థలం సైన్యానికి చెందినది అయితే ఏమనుకోవాలి? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్న వేళ షేక్‌పేట్‌లో 2,500 గజాల స్థలాన్ని ముస్లిం స్మశానవాటిక కోసం కేటాయిస్తూ రాష్ర్ట ప్రభుత్వం గతవారం జీవో జారీచేసింది.

ఆ స్థలం మాదేనంటూ వక్ఫ్ బోర్డ్ కొన్ని పత్రాలు చూపిస్తుండగా.. గతంలో మా స్థలంలో రోడ్డు వేసేందుకు అనుమతి అడిగిన ప్రభుత్వం, ఇప్పుడు స్థలానంతా లాగేసుకుంటున్నదని ఆర్మీ అధికారులు చెప్పడం విశేషం. రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు ఆత్మహత్యా సాదృశ్యాలు. అవి కేవ లం వ్యూహాత్మక తప్పిదాలుగా మిగిలిపోవు, పార్టీ సిద్ధాంతాన్ని, ప్రభుత్వ పరిపాలనా దక్షతను, నాయకుల దూరదృష్టిని నడిబజార్లో నగ్నంగా నిలబెడతాయి.

షేక్‌పేట్‌లో సైన్యానికి చెందిన భూమిని స్మశానవాటిక కోసం కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగ్గా అలాంటిదే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో  ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ అనాలోచిత నిర్ణయం ప్రభుత్వానికే కాకుండా, యావత్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. కేవలం ఒక భూ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం, ఇప్పుడు జాతీయ భద్రత, బుజ్జగింపు రాజకీయాలు, పరిపాలనా వైఫల్యం అనే మూడు కీలక అంశాల చుట్టూ తిరుగుతూ జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

  1. షేక్‌పేట్ కాలనీలో ఖబరిస్తాన్ ఏంది?
  2. ఓటు రాజకీయాల అనాలోచిత వ్యూహం
  3. ముస్లిం స్మశానవాటిక కోసం ప్రభుత్వ జీవో.. పనులను అడ్డుకున్న సైన్యం
  4. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు రాజుకున్న వివాదం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ ౧౦ (విజయక్రాంతి) : హైదరాబాద్ నడిబొడ్డున, షేక్‌పేట్‌లోని ఘైరాబాద్ మసీద్ సమీపంలో ఉన్న 2,500 గజాల స్థలాన్ని ముస్లిం స్మశానవాటిక కోసం కేటాయిస్తూ రాష్ర్ట ప్రభుత్వం గతవారం జీవో జారీచేసింది. ఈ భూమి అధికారికంగా వక్ఫ్ ఆస్తిగా నోటిఫై అయి ఉంది. బోరబండ, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్, షేక్‌పేట్ ప్రాంతాల ముస్లింల అవసరాలు తీర్చడానికే ఈ కేటాయింపు అని వక్ఫ్ బోర్డు పేర్కొంది.

అయితే, వక్ఫ్ బోర్డు పనులు మొదలుపెట్టగానే సైనిక అధికారులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ రోడ్డుతో సహా ఇక్కడి భూమి మొత్తం మా రక్షణ శాఖ ఆస్తి.. భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి విస్తరణకు, నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది లేదని మిలిటరీ అధికారులు స్పష్టంచేశారు. అత్యంత వ్యూహాత్మక మైన సైనిక భూమి దశాబ్దాలుగా రక్షణ శాఖ ఆధీనంలో ఉంది.

అలాంటి సున్నితమైన ప్రాంతంలో, 2,500 గజాల స్థలాన్ని ఖబరిస్తాన్ కోసం కేటాయించాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు ఎలా ప్రతిపాదించింది? దానికి ప్రభుత్వం గుడ్డిగా ఎలా ఆమోదముద్ర వేసింది? ఇది కేవలం అవగాహన రాహిత్యం తో జరిగిందా లేక మేం అధికారంలో ఉన్నాం, మాకు అడ్డు చెప్పేవారెవరు? అనే ధోరణితో తీసుకున్న నిర్ణయమా..? విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కంటే, కొందరి వ్యక్తిగత ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీలోని అత్యంత సీనియర్ ముస్లిం నేతలను సైతం సంప్రదించకుండా, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఏకపక్షంగా, తన పలుకుబడిని నిరూపించుకునేందుకు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల వేళ ప్రభుత్వ పెద్దలను తప్పుదోవ పట్టించి, తద్వారా మైనారిటీ వర్గాల్లో హీరోగా నిలిచిపోవాలనే ఒక వ్యక్తి సంకుచిత ఆలోచన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో తీరని అవమానాన్ని మిగిల్చింది. సైన్యం వంటి అత్యున్నత వ్యవస్థతో నేరుగా తలపడేలా చేసి, కాంగ్రెస్ అంటేనే దేశ భద్రతను ఫణంగా పెట్టే పార్టీ అనే బీజేపీ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది.

బుట్టదాఖలైన వ్యూహం..

ఈ నిర్ణయం ద్వారా ఏ ముస్లిం ఓటర్లను అయితే ప్రసన్నం చేసుకోవాలని ప్రభుత్వం భావించిందో, వారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం ఈ కథలోని అసలు విషాదం. మా ప్రశాంతమైన కాలనీలో స్మశానవాటిక ఏర్పాటు చేయడమేంటి? అంటూ స్థానిక కుటుంబాలే ప్లకార్డులతో నిరసనకు దిగాయి. కేవలం 2,500 గజాల చిన్న స్థలం ఐదు కీలక ప్రాంతాల ప్రజల అవసరాలను ఎలా తీరుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం కంటితుడుపు చర్యేనని, చిత్తశుద్ధి లేని రాజకీయమని వారు గ్రహించారు. అంటే, ప్రభుత్వం ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ, వారి నుంచే ఛీత్కారాలను ఎదుర్కొని పూర్తిగా విఫలమైంది.