calender_icon.png 12 September, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా సందేశం

06-12-2024 12:00:00 AM

ద్వాపర యుగం అంతం కావడానికి ఇంకా 38 సంవత్సరాలు ఉండగా (1998 నాటికి సుమారు 5, 137 సంవత్సరాలకు పూర్వం) ఒక మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు ఈ పవిత్రమైన భగవద్గీతాగానం జరిగింది. గీతోపదేశానికి ఎన్నుకున్న రంగస్థలమే ఒక అపూర్వమైంది. కురుక్షేత్ర రణరం గాన్నే భూమికగా తీసుకొని, శ్రీ కృష్ణార్జునుల సంభాషణా రూపంలో, ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్పినట్లుగా ఈ గీత రూపొందింది.

యుద్ధభూమిపై సమంజసమేనా?

శరీరమే ఒక కురుక్షేత్రం. మంచీ చెడు సంస్కారాలకూ, సకల కర్మలకూ కార్యక్షేత్రం, సకల సద్గుణ దుర్గుణాలకూ మనస్సే ఉత్పత్తి క్షేత్రం. మంచీ చెడులకు నిరంతరం కొనసాగే సంఘర్షణయే కురుక్షేత్ర యుద్ధం. సంకట స్థితుల్లో, అణచివేతకు గురవుతున్న‘మంచి’ ఆర్తనాదాన్ని, మానవుడిని ఈ రకమైన బోధద్వారా మాధవుడు ఆదుకొంటాడు. చెడును నిగ్రహించి బయటపడే మార్గాన్ని చూపుతాడు. ఏం చెయ్యాలో పాలుపోని నిస్సహాయస్థితిలో, భగవానుడు గీతా సందేశాన్ని వినిపించి, కర్తవ్యాన్ని బోధిస్తాడు.

ప్రతిదీ అమృత తుల్యమే

మాయా మోహితుడైన మానవుడు పూర్ణ ప్రజ్ఞుడై, మాయాధీశుడైన మహేశ్వరుని జేరడానికి అనేక సాధనా సూత్రాలను భగవానుడు ‘భగవద్గీత’లో సూచించాడు. తీవ్రమైన ధ్యానావస్థలోనే తప్ప అంతుపట్టని నిగూఢమైన వేదాంత రహస్యాలను అల్ప మేధస్కులకు కూడ అర్థమయ్యేటట్టు ఆయన బోధించాడు. ప్రతీ వాక్కూ, విషయమూ అమృత తుల్యమే. వాటిలో ఏదీ తక్కువ ప్రాముఖ్యత కలది కాదు. బంధు వ్యామోహంతో శోక పీడితుడైన అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకొని, మానవాళిని చరింపజెయ్యడానికి ఉపనిషత్తుల సారాన్నంతా సంగ్రహించి, ఆరగింపజేశాడు.

అంతిమ సందేశం

అర్జునా! నాయందే మనసు నిలుపుకో. నాయందు భక్తి కలిగి ఉండు. నా గురించి యాగం చెయ్యి. నాకు నమస్కరించు. నిశ్చయంగా నన్నే చేరగలవు. సమస్త బాహ్యేంద్రియ మనోబుద్ధి ధర్మాలను విడిచి పెట్టి, నన్నే శరణు వేడుకో. సమస్త పాపాల నుండి నిన్ను విముక్తి చేస్తాను. చింతించవద్దు. మానవుడు బంధవిముక్తుడై మాధవుని చేరడానికి మార్గాలను గీతలో ఉపదేశించాడు. రాజయోగం, భక్తియోగం, జ్ఞాన యోగాదులను గురించి చెప్పాడు. ఈ యోగాభ్యాసాల ద్వారా ఉన్నత పదానికి ఎదిగిన మహనీయుల లక్షణాలు ఎలా వుంచాయోకూడా వివరించడం జరిగింది. 

స్థితప్రజ్ఞుడు, యోగారూఢుడు, భక్తుడు, జ్ఞాని, త్రిగుణాతీతుడు, దైవీగుణ సంపన్నులు (తత్ నిరుద్ధులైన అసురీగుణ సంపన్నులూ), ఇత్యాదుల గుణ స్వభావాలను వివరించారు. ఇంకా ప్రకృతి, పురుషుడు, కర్మ, బ్రహ్మం, భగవానుని దివ్య విభూతులు, విశ్వ రూపం, సృష్టి, పునర్జన్మ, మోక్షం మొదలైన అన్ని మహత్తర విషయాలను గీత మనకు బోధించింది. అందుకే, అది మతాలకు అతీతంగా ప్రతీ మానవునికీ పఠనీయం.

  •  బాలగంగాధర పట్నాయక్
  • (‘శ్రీమద్ భగవద్గీతా పరిచయం’ నుంచి సంక్షిప్తంగా..)
  • ‘ఇంటర్నెట్ ఆర్కైవ్’ సౌజన్యంతో..


‘భగవద్గీత’ అనగానే సామాన్యులు ‘అయ్య బాబోయ్!’ అని భయపడి పోయే పరిస్థితిని తొలగించి, ఎంతో సరళతరంగా వారికి భగవంతుని మహోన్నతమైన సందేశాన్ని అందించే లక్ష్యంతో 1997లో ‘గీతాజయంతి’ సందర్భంగా ‘శ్రీమద్ భగవద్గీతా పరిచయం’ పేరున గ్రంథాన్ని బాలగంగాధర పట్నాయక్ సంకలన పరిచారు. అందులో శ్రీకృష్ణ భగవానుని గీతపట్ల సామాన్యులకు కలిగే అనేక సందేహాలను ఆయన తొలగించిన విధానం అత్యంత ప్రశంసనీయం.

‘భగవద్గీత అంటే ఏమిటి?’ నుంచి మొదలుపెట్టి ‘మోక్షసాధన’ వరకూ అందులోని ఆమూలాగ్ర విశేషాలను తేలికైన పదాలు, ప్రయోగాలతో, ఆధునికులంతా అవగాహన పరచుకోదగ్గట్లుగా అందించడం విశేషం. 11వ తేదీ ‘గీతా జయంతి’ పండుగ సందర్భంగా అందులోని అతిసాధారణమైన అంశాలను ‘విజయక్రాంతి’ పాఠకుల కోసం అందిస్తున్నాం.