05-11-2025 03:26:17 PM
ఉప్పల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విద్య అందుకునే విధంగా ఐటీడీఏలు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఆదివాసి విద్యార్థికి తక్షణమే అందించాలని ఆదివాసి స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ఓయూ పరిశోధక విద్యార్థి సాగబోయిన పాపారావు అన్నారు.
ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య పడకేసింది. ఉన్నత విద్య ఊసే లేదు అన్న చందంగా తయారైన తరుణంలో 2021-2022 విద్యా సంవత్సరం నుండి నేటి వరకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆదివాసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు విడుదల చేయకపోవడంతో ఆదివాసి గూడెల నుండి హైదరాబాదుకు వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న డిగ్రీ, పీజీ ఆదివాసి విద్యార్థులు ఫీజులు చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ కళాశాలలో ఫీజు రియంబర్ మెంట్ వస్తుందని ఆశతో చదువులు పూర్తిచేసుకుని ఎందరో నిరుపేద ఆదివాసి విద్యార్థులు సర్టిఫికెట్లు పొందుట కోసం చెప్పులు అరిగిపోయేటట్లు తిరిగినా ట్యూషన్ ఫీజులు, మెస్ బిల్లులు చెల్లిస్తేనే మాఫీ చేస్తామంటూ కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు.
మరొక వైపు ప్రైవేటు విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులు చెల్లించలేని ఎడల పరీక్షలకు అనుమతించకుండా విద్యార్థులను వేధిస్తూ ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు విడుదల చేయకపోవడంతో కాయ కష్టం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న కన్న తల్లిదండ్రులపై పెను భారం పడుతుంది అయన ఆవేదన వ్వక్తం చేసారు. ఆదివాసి విద్యార్థులు పై చదువులకు వెళ్లేందుకు ఫీజు రియంబర్స్ మెంట్ కట్టలేక కన్న తల్లిదండ్రులను కష్టపెట్టలేక ఉన్నత చదువులకు దూరమవుతూ ఊరిలో కూలీలుగా మారుతున్న మారుమూల ఆదివాసి విద్యార్థులు ఎందరో?
ప్రైవేటు కళాశాలలో ఫీజులు చెల్లించే స్తోమత లేక ప్రభుత్వ కళాశాలలో చదువులను కొనసాగిద్దామన్న సకాలంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులకు ఆదివాసి విద్యార్థులు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏల అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆదివాసి విద్యార్థులకు అందించవలసిన ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు బకాయిని వెంటనే విడుదల చేసి ఆదివాసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఆదివాసీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు.