06-12-2024 12:00:00 AM
తెలుగు రాష్ట్రాలనుండి అమెరికాలో స్థిర పడ్డవారితోపాటు ఉన్నత విద్యకోసం వెళ్లేవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. నిత్యం అనేకమంది అమెరికాకు ప్రయాణిస్తున్నారు. ప్రతీ ఏటా లక్షలాదిమంది తెలుగు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్నారు. అయినా, హైదరాబాద్ నుండి ఆ దేశానికి నేరుగా విమాన సౌకర్యం లేకపోవడం విచారకరం.
హైదరాబాద్ నుండి దుబాయ్, ఖతార్, జర్మనీ, లండన్, దోహాల మీదుగానే అగ్రరాజ్యానికి వెళ్ళ వలసి వస్తున్నది. దీనికి సుమారు 26 గంటల సమయం పడుతున్నది. ప్రయాణం కన్నా ఆయా విమానాశ్రయాలలో ఆగే సమయమే ఎక్కువగా ఉంటున్నది. లగేజీని మళ్లీ వేరే విమానంలోకి మార్చడం, దిగడం ఎక్కడం ఇబ్బందికరంగా మారుతున్నది. వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా యాతన పడుతున్నారు.
అదే హైదరాబాద్ నుండి నేరుగా వెళితే సుమారు 13 గంటలలో వెళ్లవచ్చు. సగం సమయం ఆదా అవుతుంది. చార్జీకూడా తగ్గే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ దిశగా ఆలోచించాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా