calender_icon.png 17 December, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్ కౌన్సిల్ రణరంగం

17-12-2025 01:56:08 AM

  1. వార్డుల డీలిమిటేషన్‌పై భగ్గుమన్న విపక్షాలు
  2. గెజిట్ ప్రతులను చింపి, విసిరేసిన బీజేపీ కార్పొరేటర్లు
  3. ఎంఐఎం సీట్ల కోసమేనని మండిపాటు
  4. ప్రభుత్వ నిర్ణయం నాకే తెలియదన్న మేయర్
  5. పత్రికల్లో చూశానన్న డిప్యూటీ మేయర్
  6. ప్రజాభిప్రాయం లేకుండానే పెంపా: తలసాని
  7. బడ్జెట్ ఉందా.. ప్లాన్ ఉందా?: దానం నాగేందర్ 

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరణ, వార్డుల పునర్విభజన ప్రక్రియపై చర్చించేందుకు మంగళవారం జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రభసగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు సమా వేశమైన సభ్యులు.. అధికారుల తీరుపై, ప్రభు త్వ ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ కార్పొరేటర్లు పోడి యం వద్దకు దూసుకెళ్లి, నిరసన తెలపడమే కాకుండా, గెజిట్ ప్రతులను చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో మేయ ర్  విజయలక్ష్మి సభను నిరవధికంగా వాయి దా వేశారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 20 నిమిషా లు ఆలస్యంగా 10:50 గంటలకు మేయర్ అధ్యక్షతన మొదలైంది. తొలుత కమిషనర్ ఆర్వీ కర్ణన్ పునర్విభజనపై వివరణ ఇచ్చారు.

27 మున్సిపాలిటీల విలీనం తో జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650 చ.కి.మీ.ల నుంచి 2050 చ.కి.మీలకు పెరిగిందని తెలిపారు. ప్రతి 45 వేల జనాభాను 10 శాతం అటు, ఇటు ప్రా మాణికంగా తీసుకుని 300 వార్డులుగా శాస్త్రీయంగా విభజించామని, ప్రస్తుతం అభ్యం తరాల స్వీకరణ దశలో ఉన్నామని వెల్లడించారు. సాయంత్రం 4:30 గంటల సమ యంలో సభ్యుల ప్రశ్నలకు అధికారుల నుం చి, మేయర్ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ గెజిట్ ప్రతులను సభలోనే చించివేశారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో మేయర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశానికి 126 మంది కార్పొరేటర్లు, 26 మంది ఎక్స్ అఫీషి యో సభ్యులు హాజరయ్యారు. మొత్తం 61 మంది సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్, ఎంఐఎం మినహా మిగిలిన పక్షాలన్నీ బీఆర్‌ఎస్, బీజేపీ పునర్విభజనను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి.

ఎంఐఎం కోసం గీతలు గీశారు 

వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని, కేవలం ఎంఐఎంకి సీట్లు పెంచేందుకే చేశారని, అందుకే ఆ పార్టీ సభ్యులు దీనిపై నోరు మెదపడం లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ శం కర్ యాదవ్ ఆరోపించారు. ఒక డివిజన్‌లో 15 వేల జనాభా, మరో డివిజన్‌లో 65 వేల జనాభా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇది ఏ రకమైన శాస్త్రీయత, పునర్విభజనో చెప్పాల ని, ఎంఐఎం కోసం కాదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వా దం చోటుచేసుకుంది. డీలిమిటేషన్‌పై ప్రత్యేక కమిటీ వేయాలని బీజేపీ డిమాం డ్ చేసింది.

సీజీజీ ఒక అడ్వుజరీ మాత్రమే..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మా ట్లాడుతూ.. వార్డుల విభజన చేసే అధికారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు ఎవరిచ్చారని, అదొక సలహాదారు సంస్థ మాత్రమే అని అన్నారు. రాజ్యాంగబద్ధమైన డీలిమిటేషన్ కమిషన్ వేయకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఇలా చేయడం చెల్లదని చెప్పారు. 

బడ్జెట్ ఉందా?: దానం నాగేందర్

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. విలీనం చేసిన సంస్థల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ ఏమిటి, అదనంగా బడ్జెట్ కేటాయించారా అని ప్రశ్నించారు. కేవలం విలీనం చేస్తే సరిపోదని, మౌలిక వసతుల మాటేంటని నిలదీశారు. సభ్యులందరితో మరోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ గతంలోనూ ఇలాగే జరిగిందని, చిన్నచిన్న తప్పులున్నా సరిదిద్దుకుందామని, రాజకీయ ప్రయోజనాలు ప క్కనబెట్టి డీలిమిటేషన్‌కు మద్దతివ్వాలన్నారు.

అమీన్‌పూర్‌కు అన్యాయం: ఎమ్మెల్సీ అంజిరెడ్డి 

బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. లక్షకుపైగా జనాభా ఉన్న అమీన్‌పూర్‌ను కేవ లం రెండు వార్డులుగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. మరో రెండు వార్డులు పెంచాలని, దీనికోసం అఖిలపక్ష కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నగర విస్తీర్ణాన్ని అకస్మాత్తుగా పెంచ డం సరికాదని, ప్రస్తుతానికి ఆపివేసి భవిష్యత్తులో కమిటీ వేసి నిర్ణయించాలని కోరారు.

మా డివిజన్లు గల్లంతు

పలువురు కార్పొరేటర్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి, తోకల శ్రీనివాస్‌రెడ్డి, బొంతు శ్రీదేవి, విజయారెడ్డి, స్వామి, రవీందర్ తదితరులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ‘మా డివిజన్ల రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. మాకు సంబంధం లేని ప్రాంతాలను కలిపారు. మా ఓటర్లను వేరే వార్డులకు విసిరేశారు. వార్డుల పేర్లు కూడా గందరగోళంగా పెట్టారు. స్థానికతను దెబ్బతీసేలా విభజన ఉంది.   కౌన్సిల్‌లో దీనిపై ఓటింగ్ పెట్టాలి’ అని కార్పొటర్లు  డిమాండ్ చేశారు.

మేయర్‌కైనా సమాచారం ఉందా?: తలసాని

ఎక్స్‌అఫీషియో సభ్యుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌మాట్లాడుతూ.. ప్రభుత్వం హఠాత్తుగా చేప ట్టిన ఈ విలీనం, విభజన ప్రక్రియపై కనీ సం మేయర్‌కైనా ముందస్తు సమాచారం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. దీనికి మేయర్ విజయలక్ష్మి లేదు అన్నట్లుగా తల ఊపడంతో సభలో గందరగోళం నెలకొంది.

పాలకమండలికి తెలియకుండానే అధికారులు ఏకపక్షంగా ఎలా నిర్ణ యిస్తారని విపక్షాలు నిలదీశాయి. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత జోక్యం చేసుకుంటూ.. ‘నాకు, మేయర్‌కు ముందస్తు సమాచారం ఉంది’ అని అన గా, సభ్యులు అడ్డుకున్నారు. ఎలా తెలిసిందని ప్రశ్నించగా.. పత్రికల్లో వచ్చిన కథ నాల ద్వారా తెలిసింది అని బదులివ్వడం కొసమెరుపు.