calender_icon.png 17 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బఫర్ జోన్‌లో వెంచర్

17-12-2025 01:51:48 AM

  1. నాగోల్‌లోని బండ్లగూడ చెరువు బఫర్ జోన్ ఆక్రమణ 

కండ్లు మూసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు

వెంచర్‌ను అభివృద్ధి చేసినా కన్నెత్తి చూడని టౌన్‌ప్లానింగ్ అధికారులు 

వెంచర్‌ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు 

ఎల్బీనగర్, డిసెంబర్ 16:  హైడ్రా వచ్చినా హైదరాబాద్‌లోని చెరువులకు రక్షణ లేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ స్థలాలను రియల్ ఎస్టే ట్ సంస్థలు యథేచ్ఛగా అక్రమిస్తున్నారు. నాగోల్ డివిజన్‌లోని బండ్లగూడ చెరువు (సాయినగర్) బఫర్ జోన్ స్థలాన్ని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించింది. సర్వేనెంబర్ 13 లో బండ్లగూడ చెరువు బఫర్ జోన్‌లో ఉన్న 10 మీటర్ల వెడల్పు స్థలాన్ని ఆక్రమించారు.

నుమారు ఎనిమిది ఎకరాల్లో ఆక్రమ వెంచర్ నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అడ్డదారుల్లో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తూ కోట్ల రూపాయాలను కొల్లగొడుతున్నారు. బండ్లగూడ చెరువు సర్వేనెంబర్ 31లో 37 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ రికార్డులో ఉన్నది. కానీ, క్రమక్రమంగా చెరువు ఆక్రమణలకు గురికావడంతో సుమా రు 15 ఎకరాలకు కుదించుకుపోయింది. ఈ చెరువుకు గతంలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ హద్దులను గుర్తించారు. కాగా, ఇప్పుడు చెరువు కట్ట కింద ఉన్న బఫర్ జోన్ స్థలాన్ని కబ్జా చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు.  

కట్ట కింద బఫర్‌జోన్ స్థలం కబ్జా వాస్తవమే: ఇరిగేషన్ శాఖ ఏఈ

నాగోలో బండ్లగూడ చెరువు కట్ట కింద 32 గుంటల స్థలాన్ని రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లు చేసింది. చెరువు కట్ట కింద బఫర్ జోన్ గా ప్రకటించిన 10 మీటర్ల స్థలాన్ని సైతం వెంచర్ నిర్వాహకులు కబ్జా చేసినట్లు ఉప్పల్ మండలానికి చెందిన ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఇరిగేషన్ అధికారులు మంగళవారం సాయినగర్ చెరువు(బండ్లగూడ చెరువు)ను ఉప్పల్ మండలానికి చెందిన ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

బఫర్ జోన్‌లో ఉన్న 10 మీటర్ల స్థలాన్ని కబ్జా చేశారని ఇరిగేషన్ శాఖ ఏఈ విశ్వనాథ్ తెలిపారు. వెంచర్ నిర్వాహకులు బఫర్ జోన్ స్థలాన్ని రోడ్డుగా మార్చుకున్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఆక్రమించి స్థలంలో నిర్మించిన రోడ్డు ను తొలిగించాలని వెంచర్ నిర్వాహకులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కార్యాక్రమం లో నార్త్ ట్యాంక్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు, డీఈఈ రామకృష్ణ, ఏఈఈ విశ్వనాథ్, నాక్ ఇంజినీర్ అశోక్ పాల్గొన్నారు.