calender_icon.png 17 December, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో రాదు.. జీవితం మారదు

17-12-2025 12:57:48 AM

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట 

ఈఎస్‌ఐఎస్‌లో నెలకొన్న విచిత్ర పరిస్థితి

జీఏడీ, ఫైనాన్స్, న్యాయ శాఖలు క్లియరెన్స్ ఇచ్చినా స్పందించని ప్రభుత్వం

ఇప్పటికే 60 సార్లు విజ్ఞప్తులు చేసిన ఈఎస్‌ఐ  ఉద్యోగులు

కిందిస్థాయి ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు సవరణలే లేవు

1998 నుంచి పదోన్నతులు లేకుండానే..

* గడిచిన 15 సంవత్సరాలుగా ఒక జీవో కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఒక స్థాయి ఉద్యోగుల కడు దయనీయమైన వ్యథ ఇది. స్థూలంగా చెప్పాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్.. ఐఎంఎస్ (రాష్ట్ర ఈఎస్‌ఐ)లో కిందిస్థాయిలో పనిచేసే.. అంటే నాలుగో తరగతి స్థాయిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు గడిచిన రెండున్నర దశాబ్దాలకుపైగా ఎలాంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారు.

కారణం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న జీవో 126 సవరణ అంశం. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లి.. అక్కడ శాఖాపరమైన చర్యలు తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసి తిరిగి ప్రభుత్వానికి పంపిస్తే.. పుష్కరకాలం గడిచిపోయినా ఆ ఉద్యోగులు తమ తలరాతను మార్చే జీవో కోసం ఎదురుచూడని రోజు లేదు.

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : మొదటి నుంచి మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యంలోనే ఈఎస్‌ఐ ఉద్యోగులకూడా ఉండేవారు. అయితే 1978లో మెడికల్ అండ్ హెల్త్ నుంచి ఈఎస్‌ఐ ను విభజించారు. నిజం చెప్పాలంటే.. అక్కడే ఈ సమస్యకు బీజం పడింది. సాధారణంగా ప్రతి శాఖకూ సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి. అయితే 1978లో మెడికల్ అండ్ హెల్త్ శాఖ నుంచి ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఈఎస్‌ఐ) ను వేరు చేశాక వీరికి ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్‌ను రూపొందించలేదు.


 దీనితో 1998 వరకు మె డికల్ అండ్ హెల్త్ శాఖకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌నే వర్తింపజేశారు. 1998లో రాష్ట్ర ఈఎస్‌ఐ ఉద్యోగులకు ప్రత్యేకంగా సర్వీ సు రూల్స్‌ను రూపొందిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇందులోనూ రెండు వర్గాల ను చేశారు. జీవో నెం. 183 ప్రకారం గెజిటెడ్ అధికారులు, డాక్టర్లు, లే సెక్రెటరీలకు సర్వీస్ రూల్స్‌ను అమలు చేశారు. దీని ప్రకారం వీరందరికీ పదోన్నతులు ఉండేవి.

అయితే జీవో నెం. 126ను కిందిస్థాయి ఉద్యోగులు.. అంటే నాలుగో తరగతి ఉద్యోగులైన.. నర్సింగ్ ఆర్డర్లీ (మేల్, ఫీమేల్), నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ అటెండెంట్, ఎక్స్‌రే అటెండెంట్లు తదితర పోస్టులకు ప్రత్యేకంగా విభజించారు. అయితే ఈ జీవో కిందకు వచ్చేవారికి ప్రత్యేకంగా సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయకపోవడంతో వారికి పదోన్నతులు లేకుండా పోయాయి.

పదోన్నతులు నిల్..

ఇలా సర్వీస్ రూల్స్‌కు సవరణ లేకపోవడంతో మొత్తం 10 కేటగిరీల్లోని ఉద్యోగులకు పదోన్నతులు లేవు. కిందిస్థాయి ఉద్యోగులైన నర్సింగ్ ఆర్డర్లీ, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ అటెండెంట్, ఎక్స్‌రే అటెండెంట్ తదితర ఉద్యోగస్తులకు పదోన్నతులు లేవు. ఏ స్థాయిలో ఉద్యోగంలో జాయి న్ అవుతారో అదే స్థాయిలో రిటైర్మెంట్ అ య్యేవారు.

మిగతా ఉద్యోగులందరికీ నిర్దిష్ల కాలమానం ప్రకారం పదోన్నతులు ఉండేవి. ఈ అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమయ్యింది. దీనిపై 2004 నుంచి ఉమ్మడి రా ష్ట్రంలోనే ఉద్యోగ సంఘాలు పోరాటాన్ని మొ దలుపెట్టాయి. ధర్నాలు, నిరసనలు, నిరాహారదీక్షలు.. ప్రభుత్వానికి విజ్ఞప్తులు.. ఎలా ఎన్నో మార్గాల్లో ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు.

సంయుక్త సమావేశంలో నిర్ణయం..

ఇదిలా ఉండగా, ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని 2010 ఏప్రిల్‌లో 310 పడకల నుంచి 500 పడకల స్థాయికి పెంచారు. ఈ సందర్బంగా ప్రత్యేక సర్వీసు రూల్స్‌ను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకగా జీవో నెం. 92ను జారీచేశారు. ఇందులోనూ 10 కేటగిరీలకు చెందిన కిందిస్తాయి ఉద్యోగులు.. డ్రెస్సర్స్, ల్యాబ్ అసిస్టెంట్, సీఎస్‌ఎస్ డీ అసిస్టెంట్, లైబ్రేరియన్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగులకు కూడా ఎలాం టి సర్వీస్ రూల్స్ లేకుండా చేశారు. దీనితో ఇక్కడివారికికూడా పదోన్నతులు లేకుండానే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో.. స్టేట్ ఈఎస్‌ఐలో నెలకొన్న ఈ పరిస్థితిపై అప్పటి కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీ (ఐఎంఎస్) శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అయిన భన్వర్‌లాల్ సహృద యంతో అర్థం చేసుకుని స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో సంయుక్త సమావేశాన్ని 18.1.2010 నాడు ఏర్పాటుచేసి ఉద్యోగుల సమస్యపై చర్చించారు. ఈ సమావేశంలో అందరూ చర్చించినట్టుగానే.. జీవో నెం. 126కు, అలాగే జీవో నెం. 92కు సవరణలు చేసి, స్పష్టమైన సర్వీస్ రూల్స్‌ను రూపొందించేలా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఫైల్‌ను సిద్ధం చేశారు. దీనిని ప్రభుత్వానికి పంపించారు.

జీవో కోసం 15 ఏండ్లుగా..

కార్మిక ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ నుంచి వచ్చిన సదరు దస్త్రం.. అనేక శాఖలకు తిరిగి సానుకూల నిర్ణయాలతో ప్రభుత్వం చెంతకు చేరింది. అయితే 2010 నుంచి గడిచిన 15 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి మాత్రం దీనికి సంబంధించిన జీవో వెలువడటం లేదు. పైగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), న్యాయ శాఖ, ఆర్థిక శాఖల నుంచికూడా దీనికి పచ్చజెండా ఊపారు.

అంటే చట్టబద్ధంగా చూసుకుంటే.. ఎలాంటి అడ్డంకులు లేవనే చెప్పవచ్చు. అయినా.. ప్రభుత్వం నుంచి 1998 నాటి జీవో నెం. 126కు సవరణలు చేస్తూ.. రాష్ట్ర ఈఎస్‌ఐ విభాగంలో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా స్పష్టమైన సర్వీస్ రూల్స్‌ను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే చెప్పవచ్చు.

60కిపైగా విజ్ఞప్తులు..

2010లో ఉమ్మడి సమావేశం తరువాత వెంటనే జీవోను విడుదల చేయాలని, స్టేట్ ఈఎస్‌ఐ ఆధ్వర్యంలోని నాలుగో తరగతి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా జీవోను విడుదల చేయాలటూ.. గడిచిన పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధసంస్థ) ఆధ్వర్యంలో అనేకమార్లు ప్రభుత్వానికి విజప్తులు చేస్తూ వస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే.. గడిచిన పదిహేను సంవత్సరాల్లో సుమారు 60కిపైగా సందర్భాల్లో ప్రభుత్వానికి వినతులు, విజప్తులు చేస్తూనే వస్తున్నారు.

అంటే సగటున సంవత్సరానికి నాల్గుసార్లు ఇదే విషయంపై.. ఇదే సమస్యపై.. ప్రభుత్వం జీవో విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా..సర్కారు నుంచి ఎలాటి స్పందన లేదంటే.. ప్రభుత్వం స్థాయిలో ఎంతటి నిర్లక్ష్యం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఇలా జీవో నెం. 126 పరిధిలో, అలాగే జీవో నెం. 92 పరిధిలోకి వచ్చే వందలాది మంది నాలుగో తరగతి, కిందిస్థాయి ఉద్యోగులందరూ ఇప్పుడు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇందుకోసం ప్రభుత్వం జారీచేయాల్సిన జీవో కోసం గడిచిన 15 సంవత్సరాలుగా ఎదురు చూడటంతోనే వారి సర్వీసు మొత్తం గడిచిపోతోందని లబోదిబోమంటున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఇది సాధ్యమని అందరూ ఆశించారు. అయితే గడిచిన పదేండ్లుగాకూడా అదే పరిస్థితి నెలకొంది. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వమన్నా స్పందిస్తుందని ఆశిస్తున్నా.. అదే రిక్తహస్తం వారికి కనపడుతోంది. దీనితో.. తమకు రావాల్సిన జీవో.. జీవిత కాలం లేటు అని స్టేట్ ఈఎస్‌ఐ ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు.

గిన్నిస్ బుక్‌లో చేర్చాలేమో.. 

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను రూపొందిస్తూ.. గతంలో జారీచేసిన జీవోకు సవరణలు చేస్తూ.. ప్రభుత్వం ఇచ్చే జీవో కోసం 15 సంవత్సరాలుగా ఎదురుచూడటం బహుషా ఇదే మొదటిదేమో. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, జీవో కోసం 15 ఏండ్లు అయినా స్పందన రాకపోవడం.. అనేది గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేర్చాలేమో. ఇప్పటికే పదులసంఖ్యలో విజ్ఞప్తులు చేశాం. అన్ని రకాల అనుమతులు, క్లియరెన్స్‌లు ఉన్నాయి.

ముఖ్యంగా.. జీఏడీ, లీగల్, ఫైనాన్స్ శాఖల నుంచి క్లియరెన్స్ వచ్చిన తరువాతకూడా జీవో ఇవ్వడానికి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చరిత్రలో ఇక చూడమేమో. ప్రతి శాఖలో నూ నిర్దిష్ట కాలం ప్రకారం సర్వీస్ రూ ల్స్‌కు సవరణలు చేస్తారు. కానీ ఈఎస్‌ఐలో అలా జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఎప్పుడో సిద్ధం చేసిన ఫైల్‌ను దుమ్ము దులిపి క్లియర్‌చేసి స్టేట్ ఈఎస్‌ఐలో కిందిస్థాయి ఉద్యోగులకు శుభవార్త చెబుతారనే ఆశిస్తున్నాం. లేకపోతే భవిష్యత్తు కార్యాచ రణ సిద్ధం చేసుకుంటాం.

 వి.వేణుకుమార్,

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 

(ఏఐటీయూసీ అనుబంధం)