calender_icon.png 20 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్‌కు హరిత శోభ!

20-09-2025 01:00:56 AM

  1. లక్ష్యం 25లక్షల మొక్కలు.. నాటింది 25.31లక్షలు

నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించిన జీహెఎంసీ

ఎప్పటికప్పుడు అధికారులకు జీహెఎంసీ కమిషనర్ దిశానిర్దేశం

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): భాగ్యనగరం హరిత శోభను సంతరించుకుంది. నగరంలో జీహెఎంసీ చేపట్టిన ‘వన మహోత్సవం’ కార్యక్ర మం విజయవంతమైంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి, గడువులోగా 101 శాతం మొక్కలు నాటింది.  ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటాలని రాష్ర్ట ప్రభుత్వం జీహెఎంసీకి లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే, పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధతను చాటుతూ, జీహెఎంసీ అదనంగా మరో 52,599 మొక్కలను నాటాలని అంతర్గతంగా లక్ష్యం నిర్దేశించుకుంది. వానాకాలం ఆరంభంలో వర్షాలు ఆలస్యం కావడంతో మొక్కలు నాటే కార్యక్రమం కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. ఆ తర్వాత నగరం అంతటా సమృ ద్ధిగా వర్షాలు కురవడంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.

జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఎప్పటి కప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొక్కల ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, సామాన్య ప్రజలను ఈ హరిత యజ్ఞంలో భాగస్వాములను చేశారు.

సమష్టి కృషితో..

ఈ సమష్టి కృషితో శుక్రవారం నాటికి జీహెఎంసీ గ్రేటర్ వ్యాప్తంగా 25,31,848 మొక్కలను నాటింది. జీహెఎంసీ తన మొత్తం లక్ష్యం 25,52,599 లో ఇప్పటికే 99 శాతం పూర్తి చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన మొక్కలను కూడా నాటి 100 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

నగరంలో పచ్చదనం పెంచడం ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, వాయు నాణ్యతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.