13-10-2025 04:56:01 PM
హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం ఆదివారం కలిసింది. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో ఓట్ల చోరీ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఒకే ఇంటి నంబర్ తో 43 నకిలీ ఓట్లు ఉన్నాయని, అలాగే ఓట్ల జాబితా, ఎన్నికల కోడ్ అంశాలపై సీఈఓకు నేతలు అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల వ్యవహారం బయటపడ్డిందన్నారు. కాంగ్రెస్ నేతలు 20 వేల దొంగ ఓట్లను నమోదు చేయించారని, ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 50 దొంగ ఓట్లను నమోదు చేశారని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కాయ్యారని ఆయన ఆరోపించారు. ఈ నకిలీ ఓట్ల వ్యవహారంపై సీఈఓకు ఫిర్యాదు చేశామని, పరిశీలించి న్యాయం చేస్తామని సీఈవో హామీ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో మాకు ఎన్నో లోపాలు, అక్రమాలకు ఆధారాలు లభించాయన్నారు.