18-05-2025 12:17:49 AM
న్యూఢిల్లీ, మే 17: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ తీసుకుంటున్న చర్యలను ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా శనివారం అఖిలపక్ష ఎంపీలతో కూడిన ఏడు బృందాలను నియమించి.. ఆ బృందాలకు నేతృత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను ప్రకటించింది. ఈ ఎంపీల జాబితాలో వివిధ పార్టీల ఎంపీలకు చోటుదక్కింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు కూడా నేతృత్వం వహించే అవకాశం లభించింది. తెలుగు రాష్ట్రాల ఎంపీలైన అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), పురందేశ్వరి (రాజమహేంద్రవరం)లకు కూడా చోటు దక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఏడుగురు ఎంపీల పేర్లను ప్రకటించారు. త్వరలోనే ఈ ఎంపీల బృందాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించనున్నాయి.
ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించే ఎంపీల జాబితాలో రవిశంకర్ (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), బైజయంత్ పాండా (బీజేపీ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ), శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే (శివసేన), శశిథరూర్ (కాంగ్రెస్) ఉన్నారు. వీరు మే 22 నుంచి వివిధ దేశాల్లో 10 రోజులపాటు పర్యటించనున్నారు. దాదాపు 40 మంది ఎంపీలు ఈ బృందాల్లో సభ్యులుగా ఉండనున్నట్టు తెలుస్తోంది.
గౌరవంగా భావిస్తున్నా..
విదేశాలకు వెళ్లే బృందానికి నాయకత్వం వహించే వారి జాబితాలో తన పేరు ఉండటంపై తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘ఈ బృందాలకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నా. దేశం కోసం ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడ అందుబాటులో ఉంటా. జైహింద్’ అని పోస్ట్ చేశారు.
ఎవరెవరు ఏ దేశాలకు వెళ్తారంటే!
బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాలకు సుప్రియా సూలే బృందం ఒమన్, కెన్యా, సౌతాఫ్రికా, ఈజిప్ట్ దేశాలకు వెళ్లనున్నట్టు సమాచారం అందుతోంది.