calender_icon.png 18 May, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌ఎవీ సీ 61

18-05-2025 12:03:59 AM

  1. 1696 కిలోల ఈవోఎస్-09 ఉపగ్రహం కక్ష్యలోకి.. 
  2. షార్ నుంచి ఉదయం 5:59గంటలకు ప్రయోగం 

సూళ్లూరుపేట, మే 17: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) మొదటి ప్రయోగవేదిక నుం చి ఆదివారం ఉదయం 5:59గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7:59గంటలకు కౌంట్ డౌన్ కూడా షురూ చేశారు.

పీఎస్‌ఎల్‌వీ సీ 61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ పొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. దీనినే రీశాట్-1బీ అని కూడా పిలుస్తారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. 

ఈవోఎస్ ప్రత్యేకతలు..

ఈవోఎస్-09 ఉపగ్రహం దాదాపు 1,696 కిలోగ్రాముల బరువు ఉంది. పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగం దాదాపు 17 నిమిషాల్లో పూర్తికానుంది. ఈ ఉపగ్రహం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనపైనా రాత్రి, పగలు తేడా లేకుండా భూమి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించగలదు. ఇందులో అత్యాధునికమైన సీ బ్యాండ్‌ను అమర్చారు. సీ బ్యాండ్ అంటే సింథటిక్ అపార్చర్ రాడార్. ఈ వ్యవస్థను శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహంలో అమర్చారు.

ఈ ఉపగ్రహంలో 5 విభిన్న ఇమేజింగ్ మోడ్‌లు ఉన్నాయి. అత్యంత చిన్న వస్తువును కూడా గుర్తించగల అల్ట్రా హై రెజల్యూషన్ ఇమేజింగ్ నుంచి విశాలమైన ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడే బ్రాడర్ స్కాన్స్ కూడా దీనిలో అమర్చి డిజైన్ చేశారు. ఇప్పటిదాకా ఉన్న ఈవోఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్‌ను అమర్చి పంపిస్తున్నారు.