calender_icon.png 18 May, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత క్షిపణుల దెబ్బ మాకు తగిలింది

18-05-2025 12:48:20 AM

-నిజం అంగీకరించిన పాక్ ప్రధాని షెహబాజ్

న్యూఢిల్లీ, మే 17: భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిజాన్ని అంగీకరించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. షెహబాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 9 మధ్యరాత్రి సమయంలో రావల్పిండిలోని నూర్‌ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్టు  అంగీకరించారు.

ఇందుకు సంబం ధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థనలు ముగించుకొని ఈత కొట్టేందుకు వెళ్లా. నా సెక్యూర్డ్ ఫోన్ మాత్రమే తీసుకెళ్లా. రెండుసార్లు మోగింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ లైన్‌లో ఉన్నారు. భారత్ దాడులు చేస్తున్న విషయాన్ని చెప్పారు.

వాటిని ఎదుర్కొనేందుకు వైమానిక దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాల ను కూడా వినియోగిస్తోందని పేర్కొన్నారు’ అంటూ షెహబాజ్ వివరించా రు. అయితే, భారత్‌పై పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు కూలిపోయిన విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో దాయాది పాకిస్థాన్ వణికిపోయింది. మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే, ఈ నష్టంపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాక్.. తాజాగా నిజాన్ని అంగీకరించింది.