26-10-2025 12:20:38 AM
కత్తితో దాడికి యత్నించడంతో ఆత్మరక్షణార్థం కాల్పులు
మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్‌కు గాయాలు
డీసీపీ గన్‌మన్‌కూ స్వల్ప గాయాలు : సీపీ సజ్జనార్
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 25 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా గ్రౌం డ్ వద్ద సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునే ప్ర యత్నంలో, వారు కత్తితో ఎదురుదాడికి దిగడంతో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఆత్మరక్షణా ర్థం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమిన ల్, కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ ఉమర్ గాయపడగా, అతడిని చికిత్స నిమి త్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో డీసీపీ గన్‌మన్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే..
చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ సమీపంలో శనివారం సాయత్రం ఇద్దరు వ్యక్తులు సెల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో, డీసీపీ చైతన్య తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగలు పోలీసులపైనే తిరగబడి, కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ తోపులాటలో డీసీపీ చైతన్య గన్‌మన్ కింద పడిపోగా, నిందితులు అతనిపై దాడి చేసి గాయపరిచారు.
పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన డీసీపీ చైతన్య, తక్షణమే అప్రమత్తమై తన గన్‌తో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక దొంగకు ఛాతి, మెడ భాగంలో గాయాలై కుప్పకూలగా, మరో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన దొంగను వెంటనే నాంపల్లిలోని ఆసుపత్రికి తరలించారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉమర్ : సీపీ సజ్జనార్
ఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించా రు. అనంతరం సీపీ సజ్జనార్ మీడియా తో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సెల్ ఫోన్ చోరీకి యత్నించిన దొంగలను పట్టుకోబోగా వారు కత్తితో ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో డీసీపీ చైతన్య గన్‌మన్‌కు గాయాలయ్యాయి.
పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకే డీసీపీ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది, అని ఆయన స్పష్టం చేశారు. గాయపడిన నిందితుడిని కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ ఉమర్‌గా గుర్తించామని, అతనిపై గతంలో అనేక కేసులు ఉన్నాయని, హైదరాబాద్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఉమర్ ఉన్నాడని సీపీ తెలిపారు.
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, డీసీపీ చైతన్య, ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.