26-10-2025 12:22:00 AM
పీడీఎస్‌యూ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు
ముషీరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): దేశంలో నేడు ప్రజాస్వామ్యం తీవ్రమైన సంక్షోభ దశలో ఉన్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం రోజు రోజుకు తీవ్రమైపోతుందని, అదే విధంగా దేశ పౌరుల భవిష్యత్తు కూడా చాలా ఆందోళనకరంగా మారిపోతుందని అన్నారు. డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీడీఎస్ యు రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పీడీఎస్ యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు జీవన్ కుమార్, పీడీఎస్ యూ జాతీయ నాయకులు పి.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.లక్ష్మీనారాయణ, ఓయూ ప్రొ.కొండా నాగేశ్వర్ తో కలిసి మహాసభల లోగోను హరగోపాల్ ఆవిష్కరించి మాట్లాడారు.
రాజ్యాంగానికి విఘాతం కలిగించే విధానాలకు పాలక ప్రభుత్వాలు పాల్పడుతున్నా యన్నారు.1970లో జార్జిరెడ్డి ప్రేరణతో ఆవిర్భవించిన పీడీఎస్‌యూ 5 దశాబ్దాల కాలం గా దేశంలో శాస్త్రీయమైన, సమానమైన విద్య విధానం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ మహోజ్వలమైన చరిత్ర ను నిర్మించిందన్నారు. మానవ సంబంధాలన్నీ కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సమానమైన, నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ఆరోపించారు. నిత్యం స్వదేశీ జపం చేసే భాజపా విద్యను వ్యాపార సరుకుగా మారుస్తూ విదేశీ, ప్రైవేటు యూని వర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అం దించడం ద్వారానే సమాజం పురోగతి చెం దుతుందని అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో విద్యకు అధిక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
విద్యా పరిరక్షణ కోసం మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఉపేందర్, మాగి వెంకన్న, పోటు నారాయణ, దుబ్బ రంజిత్, పీడీఎస్ యూ రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాస్, జన్నారపు రాజేశ్వర్, మంద నవీన్, కే.శ్రీనివాస్, గౌతం, తీగల శ్యామ్, ఆసిఫ్, ఝాన్సీ, గణేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.