28-11-2025 12:21:00 AM
వాషింగ్టన్, నవంబర్ 27: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరగగా అమెరికా ప్రభుత్వం ఆఫ్గనిస్తాన్ జాతీయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పౌరుల వలస దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తక్షణమే నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రెహ్మానుల్లా లకన్వాల్ అనే 29 ఏళ్ల ఆఫ్గన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై బుధవారం కాల్పులకు తెగబడ్డాడు.
ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, నిందితుడిపై కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) స్పందిస్తూ భద్రతాపరమైన అంశాలను సమీక్షించే వరకు ఆఫ్గన్ జాతీయుల వలస దరఖాస్తులన్నింటినీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రజల భద్రతే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది.
హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ నిందితుడు బైడెన్ ప్రభుత్వ హయాంలో 2021 సెప్టెంబర్ 8న ’ఆపరేషన్ అలైస్ వెల్కమ్’ కింద అమెరికాలోకి ప్రవేశించాడని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. థ్యాంక్స్ గివింగ్ పండుగకు ముందు జరిగిన ఈ దాడి ఒక రాక్షస చర్య అని పేర్కొన్నారు.
ఇది తమ దేశంపై, మానవత్వంపై జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. ఆఫ్గనిస్తాన్‌ను ’భూమిపై ఉన్న నరకం’గా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం వైట్‌హౌస్ వద్ద లాక్‌డౌన్ కూడా విధించిన సంగతి తెలిసిందే.