21 August, 2026 | 1:46 AM

కాంగ్రెస్ మెడకు 22ఏ!

21-08-2026 12:51 AM
  1. లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో 
  2. అమ్ముకోలేక, అవసరాలు తీర్చుకోలేక జనం అవస్థలు
  3. తప్పు జరిగిందన్న ప్రభుత్వం
  4. మూల్యం తప్పదంటున్న విశ్లేషకులు

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): పెనం మీది నుంచి పొయ్యి లో పడ్డట్టయ్యింది తెలంగాణ ప్రజల పరిస్థితి.  ధరణిలో అక్రమాలను తొలగించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ‘ధరణి’ని భూ భారతిగా మార్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సు మారు లక్ష ఎకరాల భూములను 22ఏ కింది నిషేధిత జాబితాలో చేర్చడం తో ప్రజలు రెవెన్యూ అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదాహాది శుభకార్యాలు, కుటుంబ అవసరాలకు అమ్ముకు నేందుకు వీల్లేక లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారాన్ని సత్వరమే చక్కదిద్దకపోతే రాజకీయంగా మూల్యం తప్పదని విశ్లేషకులు హచ్చరిస్తున్నారు.

అధికారులకు కొత్త అవకాశం 

22ఏ నిషేధిత జాబితా వ్యవహారంలో తప్పు జరిగిందని సాక్ష్యాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నారు. అధికారుల తప్పిదంతో పొరపాటు దొర్లిందంటూ క్షమాపణ కోరారు. అంతేకాకుండా తప్పును సరిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని బాధితులకు భరోసానిచ్చారు.ఇదే అదునుగా భావించి రెవెన్యూ అధికారు లు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

గత ప్రభుత్వంలో అధికారాలన్నీ సీసీఎల్‌ఏ, చీఫ్ సెక్రటరీకే..

గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చినప్పుడు రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగాయని ప్రజలు చెబుతున్నారు. అయితే భూ రికార్డుల్లో తప్పొప్పుల సవరణకు   చీఫ్ సెక్రెటరీ స్థాయి వరకు వెళ్లాల్సి వచ్చేదన్న అభిప్రాయం ఉండేది.  తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ల అధికారాలను  తొలగించి సీసీఎల్‌ఏ, చీఫ్ సెక్రెటరీలకు ఇవ్వడంతో ప్రజలకు ఇబ్బం దులు మొదలయ్యాయి. భూ యజమాని పేరు, భూ సరిహద్దులు, సర్వే నంబర్, భూ విస్తీర్ణం ఇలా.. ఏ చిన్న తప్పిదం వచ్చినా బాధితులు చేసుకున్న దరఖాస్తులు సీసీఎల్‌ఏ, చీఫ్ సెక్రెటరీ కార్యాలయానికి వెళ్లేవి.

అక్కడ లక్షల కొద్దీ దరఖాస్తులు పేరుకుపోయి సకాలంలో పరిష్కా రం కాక ప్రజలు గగ్గోలు పెట్టేవారు. నిజానికి ఇలా వచ్చిన దరఖాస్తులను, అందులోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిద్దాల్సిన అధికారాన్ని ఆర్డీవో, కలెక్టర్లకు ఇవ్వాల్సింది. కానీ రాష్ట్రంలోని ఏ మూలన తప్పు జరిగినా సరిదిద్దే అధికారాన్ని చీఫ్ సెక్రెటరీకి మాత్రమే అప్పగించడంతో నెల లు, సంవత్సలు గడిచేది. ఇది కాస్తా బీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహానికి దారి తీసింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

పరిష్కరించకుంటే కాటు తప్పదా?

ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా.. ప్రజల భూముల ను నిషేధిత జాబితా నుం చి తొలగించకపోతే.. ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ఆగ్రహానికి దారితీసి.. గతంలో బీఆర్‌ఎస్‌కు ఎదురైన పరిస్థితిని కాంగ్రెస్‌కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సాక్షాత్తు రెవెన్యూ శాఖా మంత్రి తప్పు జరిగిందని ఒప్పుకున్నప్పుడు.. ఈ సమస్యను వేగంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 22 ఏ పేరుతో ఉన్న నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.

ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా  పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న లక్ష ఎకరాలను ఆ జాబితా నుంచి బయటపడేయాలి. సామాన్యులు.. తమ ఆస్తులను కుటుంబ అవసరాలకు వీలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించాలి. అప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. లేకపోతే..  బీఆర్‌ఎస్‌కు ఎలా చుక్కెదురైందో.. అలాటి పరిస్థితిని తెచ్చుకోవద్దని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.