26-10-2025 12:54:00 AM
ప్రముఖ హాస్య నటుడు సతీశ్ షా (74) శనివారం మధ్యాహ్నం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పోరాడుతున్న సతీశ్ షా ఇటీవలే కిడ్నీలు మార్పిడి చేయించుకున్నారు. సతీశ్ మరణ వార్తను ఆయన వ్యక్తిగత సిబ్బంది ధ్రువీకరించారు. హాస్యనటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సతీశ్ షా..
మరెన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. 1978లో విడుదలైన ‘అరవింద్ దేశాయ్ కి అజీబ్ దస్తాన్’ సినిమాతో సతీశ్ షా సినీ జీవితం ప్రారంభమైంది. 1980, 90ల్లోనే కాక 2000ల్లోనూ ఆయన కెరీర్ విజయంతంగా కొనసాగింది. ఇప్పటివరకు 250కి పైగా సినిమాల్లో నటించారు. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’, ‘జానే భీ దో యారో’, ‘మై హూ నా’ల్లో సతీశ్ షా పోషించిన పాత్రలు ప్రేక్షకుల మందిలో నిలిచిపోయాయి.
‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’లో ఇంద్ర వదన్ సారాభాయ్ పాత్ర భారతీయ టీవీ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ హాస్య పాత్రల్లో ఒకటి. ‘హమ్ సాథ్-సాథ్ హై’, ‘మై హూ నా’, ‘కల్ హో నా హో, ‘కభీ హాన్ కభీ నా’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘ఓం శాంతి ఓం’ వంటి చిత్రాలెన్నో అతని ఫిల్మోగ్రఫీలో ప్రముఖమైనవి. సతీశ్ షా అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి.