11-10-2025 01:00:36 AM
అది వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యం. తరతరాలుగా బాటసారులకు నీడనిచ్చిన మహావృక్షం. పక్షులకు ఆవాసం.. స్థానికులు కొలిచే గుడికి పచ్చని గొడుగు. కానీ, కార్పొరేట్ దాహానికి ఆ మహావృక్షం ఇప్పుడు బలిపశువైంది. హరితహారం అంటూ ప్రభుత్వం ఓవైపు మొక్కలు నాటుతుంటే, రియల్ ఎస్టేట్ దిగ్గజం ‘సుఖీ ఉబుంటు’ నిర్మాణ సంస్థ మాత్రం పచ్చని చెట్లను నరుకుతూ పర్యావరణానికి సమాధి కడుతోంది. మణి కొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో తమ బహుళ అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టు కోసం, దశాబ్దాల నాటి మర్రి చెట్టు కొమ్మల ను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : పుప్పాలగూడ ప్రాంతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి బంగారు గని. ఇక్కడి భూముల ధరలు ఎప్పటికప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సుఖీ ఉబుంటు సంస్థ, ఇక్కడ అత్యంత విలాసవంతమైన భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది.
అయితే, ఈ ప్రాజెక్టు డిజైన్‌కు, నిర్మాణ పనులకు ఆ ప్రాంతంలో తరతరాలుగా ఉన్న ఒక భారీ మర్రి చెట్టు అడ్డుగా మారింది. ఆ చెట్టు కిందనే స్థానికులు ఎంతో భక్తితో పూజించుకునే ఒక పురాతన గుడి ఉంది. నిర్మాణ సంస్థ కేవలం లాభం కోసం, స్థల వినియోగం కోసం పర్యావరణ సమతుల్యతను, స్థానికుల మనోభావాలను దారు ణంగా దెబ్బతీసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతులేని అనుమానాలు..
ఒక చెట్టును నరకాలంటే అటవీ శాఖ నుంచి, స్థానిక మున్సిపాలిటీ నుంచి కఠినమైన నిబంధనలకు లోబడి అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా, వందేళ్లకు పైబడిన వయసున్న చెట్లను హెరిటేజ్ వృక్షాలుగా పరిగణించి, వాటిని నరకడానికి అనుమతులు ఇవ్వరు. అలాంటిది, ఆలయ ప్రాం గణంలో ఉన్న ఇంతటి మహావృక్షాన్ని నరకడానికి ఎవరు అనుమతి ఇచ్చారు..? ఒకవేళ అనుమతులు లేకుండానే ఈ ఘాతుకానికి పాల్పడితే, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు..
వాల్టా చట్టం ఏం చెబుతోంది..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. సుఖీ వంటి పెద్ద నిర్మాణ సంస్థలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా..? అని పర్యావరణ ప్రేమికులు ప్రశ్ని స్తున్నారు. నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న ఈ తరుణంలో, మిగిలి ఉన్న పచ్చదనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
కేవలం లాభార్జనే ధ్యేయంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్న సుఖీ వంటి సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, నరికిన చెట్టుకు బదులుగా వందల మొక్కలు నాటేలా చేసి, భారీ జరిమానా విధించాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, భవిష్యత్ తరాలకు మనం అందించేది కాలుష్యాన్ని, రోగాలను తప్ప మరేమీ ఉండదు.అయితే, ఇంత పెద్ద ఘటన జరుగుతుంటే తమకు తెలియదని అధికారులు చెప్పడం వారి పర్యవేక్షణ లోపాన్ని, ఉదాసీన వైఖరిని స్పష్టం చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చట్టరీత్యా నేరం
ఏదైనా చెట్టును నరకడం చట్టరీత్యా నేరం. నేను ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాను, కాబట్టి ఈ విష యం నా దృష్టిలో లేదు. వెంటనే మా సిబ్బందితో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తాను. వాస్తవాలను పరిశీ లించి, చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం.
ఫరీద్, ఎఫ్‌ఎప్‌వో ఫారెస్ట్, మణికొండ
డబ్బే ముఖ్యమా.. దేవుడు కాదా
ఈ చెట్టు మా తాతల కాలం నుం చి ఉంది. గుడికి వచ్చేవాళ్లం, పండగలు చేసుకునేవాళ్లం. ఎండలో సేద తీరుతుంటిమి. అలాంటి చెట్టు కొమ్మలను ఇంత దారుణంగా నరికేశారు. ఇప్పుడు గుడి మీదకు నేరుగా ఎండ కొడుతోంది. డబ్బే ముఖ్యమా.. దేవు డు, ప్రకృతి ముఖ్యం కాదా..
సంతోష్‌రెడ్డి, పుప్పాలగూడ, మణికొండ
చర్యలు తీసుకుంటాం
మా దృష్టికి ఇప్పటి రాలేదు.. అక్కడ పరిశీలించి వివరాలు తెలుసుకుని ఏదైనా తప్పు జరిగింది అని తెలుస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
ప్రసాద్‌రావ్, సీపీవో, శంకర్‌పల్లి ఏఎమ్‌డీఏ