8 May, 2026 | 10:43 AM

నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్న

31-08-2024 04:05 AM
  1. న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం ఉంది
  2. సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా దానిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కోర్టు విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లుగా ఆపాదించేలా మీడియాలో వచ్చిన తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని, దాని విలువలను సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిగా న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని, దాన్ని ఎప్పటికీ కొనసాగిస్తానని తెలిపారు. 

కవిత బెయిల్ విషయంలో వ్యాఖ్యలు..

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ కేవీ విశ్వనాథన్, బీఆర్ గవాయి తీవ్రంగా మండిపడ్డారు. కవితకు 5 నెలల్లోనే బెయిల్ రావడంతో చర్చ జరుగుతోందని ఇటీవల ఓ చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టట్లేదన్నారు. ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ కోసం 15 నెలలు పట్టిందని, ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిలే రాలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్‌ఎస్ పనిచేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంలోనే ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీడియాలో కథనాల రావడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.