25-10-2025 11:41:22 PM
సంస్కృతి నిర్మాణ్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుణాకర్ శర్మ
ముషీరాబాద్ (విజయక్రాంతి): సంస్కృతి నిర్మాణ్ ట్రస్ట్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో ‘హరి హరుల కోటి దీపోత్సవం‘ కార్యక్రమాన్ని ఈనెల 30 నుండి నవంబర్ 20 వరకు పటాన్ చెరు వాల్యూజోన్ హైపర్ మార్ట్ ఎదురుగా ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ గేట్ నంబర్ 3 దగ్గర నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ గుణాకర్ శర్మ వెల్లడించారు. ఈ మేరకు శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరి హరుల కోటి దీపోత్సవం సంబంధించి బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
ఈ దీపోత్సవంలో ప్రతిరోజు నాదస్వరం, గణపతి, హరిహరుల పూజలు భక్తులచే సామూహిక లలిత, విష్ణు సహస్రనామ పారాయణములు, ప్రవచనాలు, శివ కేశవుల కళ్యాణాలు, ప్రతినిత్యం ప్రదోషకాలంలో గురువుచే విశేష ద్రవ్యములచే మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే సప్త హారతి, మహాహారతి, లింగోద్భవం, లక్షవత్తుల కథ, సత్యనారాయణ స్వామి వ్రతాలు. అఖండ దీపం, కోటిపుష్పార్చన, కోటి బిల్వార్చన, కోటి భస్మార్చన, కోటి రుద్రాక్షార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ దీపోత్సవంలో సంగారెడ్డి కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని గుణాకర్ శర్మ వెల్లడించారు. ఎంట్రీ ఉచితమని, పూర్తి వివరాలకు samskruthinirmantrust@gmail.com సంప్రదించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వినయ్ కుమార్, సదానంద శర్మ, ప్రశాంత్ పుట్టపర్తి, ప్రవీణ్ పన్నాల, నాగేందర్ సింగ్, షను తదితరులు పాల్గొన్నారు.