25-10-2025 11:44:45 PM
ఎన్నికల అధికారికి వినతి పత్రం అందజేత
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందు అక్రమ డబ్బు, మద్యం పంపిణీ పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ బీఆర్ కే భవన్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఎన్నికల అక్రమాలపై శనివారం ఆప్ ప్రతినిధి బృందం కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్బంగా ఓటర్లను మభ్య పెట్టడానికి ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగంగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు లంచం ఇవ్వడం స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలకు విఘాతం కలిగించడమేనని అన్నారు. జూబ్లీ హిల్స్ ఓటర్లకు లంచం ఇవ్వడంలో ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పాడడం తరచుగా ప్రజాస్వామ్య క్షీణతకు దారితీస్తుందన్నారు. అక్రమంగా డబ్బు పంపిణీ చేయడాన్ని అరికట్టడంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఫుర్తిగా విఫలమౌతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తక్షణమే స్పందించి కఠినమైన నిఘా, చర్యలు చేపట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు సాఫీగా జరిగేలా చూడాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర నాయకులు బుర్ర రాము గౌడ్, విజయ్ మల్లంగి, ఎంఏ. మాజీద్, జావీద్ షరీఫ్, దర్శనం రమేష్ తదితరులు పాల్గొన్నారు.