05-08-2025 12:03:28 AM
బీఆర్‌ఎస్ నేతలంతా నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా ఆఫీస్‌కు చేరుకోవాలి
అర్మూర్, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు వివరించేందుకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి టీ. హరీష్ రావు మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పై ఉన్న అపోహలను తొలగించనున్నారని ఆయన పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించేందుకు నిజామాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్ ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్, షకీల్ లతో పాటు పార్టీ జిల్లా నేతలంతా పాల్గొంటారని ఆయన తెలిపారు. కావున జిల్లాలోని అన్ని మండలాల బీఆర్‌ఎస్ నేతలు, మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు , మునిసిపల్ మాజీ ఛైర్మన్ లు ఉదయం తొమ్మిదిన్నర గంటలలోపు నిజామాబాద్ లోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకోవాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.