06-09-2025 05:15:23 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక బిజెపి-బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన తలుచుకుంటే రోడ్లమీద తిరగలేరని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి విమర్శించారు.శనివారం నల్గొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని 1 నెంబర్ వినాయక విగ్రహం వద్ద గణేష్ నిమజ్జనం రోజు బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వారిద్దరి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి మాట్లాడుతుండగా.. తనను పైకి పిలవలేదని అక్కసుతో బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఘర్షణ వాతావరణం సృష్టించాడని ఆరోపించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.150 కోట్లతో లతీఫ్ షాప్ గుట్ట, బ్రహ్మంగారి ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పాడు తప్ప కాంగ్రెస్ చేస్తుందని చెప్పి రాజకీయాలు చేయలేదన్నారు.బిజెపి జిల్లా అధ్యక్షుడికి కనీస రాజకీయ అవగాహన లేదని ధ్వజమెత్తారు.
అనంతరం అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించాడని విమర్శించారు.బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యే గన్మెన్ల కోసం పాకులాడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ నాయకులతో దాడులు చేయించుకుని గన్ మెన్ లు పెట్టుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.మేము దేవుని దగ్గర ఎన్నడూ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోవ్యక్తిగతంగా, పరోక్షంగా 10 వేల మందికి సహాయం అందించాడని అన్నారు.నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నోటి దురుసు వలన గత ఎన్నికల్లో ప్రజలు 54 వేల ఓట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని గెలిపించడం జరిగిందని అన్నారు.రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.రెండు మూడు పార్టీలు మారిన వ్యక్తి కూడా యూరియాపై చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, స్థాయిని మించి మంత్రిపై విమర్శనాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు.ఎక్కడ లేని విధంగా నల్లగొండలో బిజెపి,బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉందని ధ్వజమెత్తారు.