10-01-2026 01:05:14 AM
పైసలు లేనిదే ఫైలు కదలదు
అధికారి కోసం క్యూ కడుతున్న ఫైరవీదారులు
ఇసుక రీచుల్లో అవినీతి దోపిడీ
ఆయన అవినీతికి కేరాఫ్ అధికారి. గతంలో ఓ మండలంలో తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో భూవివాదంలో లంచం తీసుకుంటుండగా అవినీతి శాఖాధికారులకు నగదుతో పట్టుబడిన ఆయన స్వల్ప కాలంలో రాజకీయ పలుకు బడితో కేసును మాఫీ చేయించుకొని తన పొలిటికల్ పలుకు బడితో పేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తిష్టవేసి ఏకంగా ముఖ్య విభాగానికి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దీంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ అధికారిని సెలవులో వెళ్ళటం తో వెంటనే కలెక్టర్ మెప్పు పొంది ప్రధాన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏకంగా గతంలో అవినీతికి పాల్పడిన అధికారి కలెక్టర్ కార్యాలయంలో కూడా అవినీతికి తెరలేపుతూ లంచాల మయం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నారాయణపేట. డిసెంబర్ 9 (విజయక్రాంతి) : నారాయణపేట జిల్లాలో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. అధికారులు ఎంత అవినీతికి పాటు పడతారో అంత ప్రధాన శాఖలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహించించొచ్చని ఈ అధికారిని చూస్తే తెలుస్తుంది.
ముఖ్యంగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత ఓ మండలంలో తహసీల్దార్ గా పని చేస్తున్నసమయంలో అవినీతి శాఖాధికారుల దాడుల్లో ఓ భూమి విషయంలో భారీగా లంచం తీసుకుంటుండగా అవినీతి శాఖాధికారులు మాటు వేసి దాడులు చేసి నగదుతో పట్టుకున్న సంగతి ప్రజలకు తెలిసిందే అదే అధికారి కొన్ని నెలలుగా కలెక్టరేట్ లో ఓ సెక్షన్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి ఆ శాఖలో ఆన్లైన్ ఇసుక, నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించటం జరిగింది.
దీంట్లో భాగంగానే కొంతమంది ఇసుక నిర్వాహకుల దగ్గర నుండి లంచాలు తీసుకొని ఇసుక రీచ్లు ఆఫ్ లైన్ లో ఇసుకకు అనధికారికంగా అనుమతులు ఇచ్చి లంచాలకు తెర లేపుతూ విధులు నిర్వహిస్తున్న ఆయనపై కొంతమంది ఇసుక నిర్వాహకులు బాహాటంగా విమర్శలు సైతంచేసిన సంఘటనలుఉన్నాయి. అదే అధికారి కలెక్టర్ కార్యాలయంలో అదే శాఖనుండి మళ్ళీ ప్రధానశాఖలో ముఖ్య అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పట్టిందల్లా బంగారంగా మారిపోయిందని కొంతమంది అధికారులు గుస గుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అధికారి కోసం భూములకు సంభందించిన కొంత మంది రియల్టర్లు, సారు దర్శనం కోసం పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఫైళ్ళు క్లియర్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు కలెక్టర్ కార్యాలయంలో కొంత మంది సహచర సిబ్బంది ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కలెక్టర్ కార్యాలయంలో అవినీతికి తావు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అలాగే అవినీతికి దూరంగా ఎంతో మంది అధికారులు ఉన్నా అవినీతి కి పాల్పడిన అధికారిని అందలం ఎక్కించి కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండాచూడాలని పలువురు కోరుతున్నారు.