10-01-2026 01:05:13 AM
అశ్వారావుపేట, జనవరి 9 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు నీరందించి రైతుల కష్టాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వాటాలో ప్రతి నీటి బొ ట్టును ఒడిసిపడతామని, జలాలపై హక్కుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో పర్యటించారు.
క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ పనులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం నాలుగో పంప్‌హౌస్ పనుల పురోగతి తో పాటు మొత్తంగా ప్రాజెక్టు పనుల స్థితిగతులపై సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా 968 టీఎంసీలని, నీటి లభ్యత 75 శాతం దాటిన తర్వాత సీతారామ ఎత్తిపోతలకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.19,324 కోట్లతో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.
భూసేకరణ ప్రక్రియకు ఆరు నెలల్లో రూ.5,000 కోట్ల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి, కృష్ణా జలాల హక్కుల విషయంలో ఏమాత్రం రాజీపడమని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పినపాక, కొత్తగూడెం, అశ్వరావు పేట, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు పూర్తయితే, ఈ ఏడాదిలోనే కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని వెల్లడించారు. సమీక్ష సమావేశంలో అశ్వారావుపేట సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
50 శాతం రాయితీపై యాంత్రీకరణ పరికరాలు: మంత్రి తుమ్మల
రైతులకు ౫౦శాతం రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ప్రకృతి/సహజ వ్యవసాయ విధానాల అమలుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, ఆధునిక సాంకేతిక సేద్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ సామగ్రి ప్రదర్శన శాలలను సందర్శించారు.
రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం వ్యవసాయ కళాశాలలో బయోడైవర్సిటీ పార్కు , రూ.5 కోట్ల తో నిర్మించనున్న బాలికల వసతి గృహం, రూ.3 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. జిల్లాలో ఏ పంటేసినా పండించే సామర్థ్యం ఉన్న రైతులు ఉన్నారని ప్రశంసించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించడం ఆనందాన్నిచ్చిందన్నారు. పథకంలో భాగం గా రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.31 లక్షల మంది రైతులకు రూ.101 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు పాల్గొన్నారు.