calender_icon.png 11 January, 2026 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిడ్‌మానేరు అవినీతి ఫై(న)ల్స్ రెడీ!

10-01-2026 01:38:33 AM

  1. సర్కారు నుంచి సిగ్నల్.. ‘విజిలెన్స్’లో కదలిక
  2. నివేదికల దుమ్ము దులుపుతున్న అధికారులు
  3. పలు సాంకేతికఅంశాలపై కమిషన్ క్లారిటీ 
  4. కొండపోచమ్మ రిజర్వాయర్, బుద్ధారం కెనాల్ నిర్మాణంలో అవకతవకలపై కదలనున్న దస్త్రాలు
  5. ‘విజయక్రాంతి’ కథనంతో ప్రభుత్వంలో చలనం

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మిడ్‌మానేరుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేసిన విచారణ నివేదికలో కదలిక వచ్చింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో.. విజిలెన్స్ కమిషన్ వద్ద కొంత కాలంగా నిలిచిపోయిన నివేదికల ఫైళ్లను అధికారులు దుమ్ము దులుపుతున్నారు.

త్వరలోనే మిడ్‌మానేరు ప్రాజెక్టు అవినీతి ఫైల్స్ తుది నివేదికలను ప్రభుత్వానికి పంపించేందుకు విజిలెన్స్ కమిషన్ రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే కొండపోచమ్మ రిజర్వాయర్, బుద్ధారం కెనాల్ నిర్మాణంలో అవకతవకల దస్త్రాల్లో కదిలిక వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక..

ప్రస్తుతం ప్రభుత్వానికి అన్ని అంశాలూ పేర్కొంటూ లేఖను సిద్ధం చేస్తున్న విజిలెన్స్ కమిషన్.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను పంపించేందుక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే.. విజిలెన్స్ విభాగం నుంచి వచ్చిన నివేదికలో కొన్ని సాంకేతిక అంశాల గురించి కూడా కమిషన్ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలుస్తుంది. నివేదికలోని పలు టెక్నికల్ అంశా లు, వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో కనుగొన్న వాస్తవాలను మరోసారి ఉన్నతాధికా రులతో మాట్లాడి అనుమానాలను నివృత్తి చేసుకున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి త్వరలోనే మిడ్‌మానేరుపై విజిలెన్స్ నివేదిక చేరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. వీటితోపాటు కొండపోచమ్మ రిజర్వాయర్, బుద్ధారం కెనాల్ నిర్మాణంలో నెలకొన్న అవకతవకలపై, అక్రమాలపై విజిలెన్స్ చేసిన విచారణలో వెల్లడైన వాస్తవా లపై నివేదికలకు కూడా మోక్షం లభిస్తుందని, ఇవన్నీ ప్రభుత్వానికి చేరిన వెంటనే.. బాధ్యలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సాగునీటి శాఖ ఉద్యోగ వర్గాల్లోనూ చర్చ మొదలైంది.

విజయక్రాంతి కథనంతో..

మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ 2025 ప్రారంభంలో ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదును విజిలెన్స్ విభాగానికి పంపించారు. దీనితో లోతుగా విచారణ చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసిన విజిలెన్స్ అధికారులు అక్రమాలు, అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారించి ఇందుకు బాధ్యులుగా ఇద్దరు కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులను బాధ్యులుగా తేల్చారు.

దీనిపై పూర్తిస్థాయి నివేదికను విజిలెన్స్ కమిషన్‌కు పంపించారు. అలాగే కొండపోచమ్మ రిజర్వాయర్‌లో అక్రమాలు, బుద్ధారం కెనాల్ నిర్మాణంలోనూ జరిగిన అవకతవకలు, అక్రమాలపై కూడా విజిలెన్స్ విభాగం విచారణ చేసి కమిషన్‌కు నివేదికలు సమర్పించాయి.

అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో కమిషన్ వద్దే ఈ మూడు నివేదికలు తిష్టవేశాయి. కొద్ది నెలలుగా కమిషన్ కార్యాలయంలో అలాగే ఉండటంపై.. ఈనెల 6న ‘విజయక్రాంతి’లో విజిలెన్స్‌కు విలువేదీ? అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనితో ప్రభుత్వంలో చలనం వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అంశాలు కావడం, చాలా రోజులుగా కమిషన్ వద్ద నివేదికలు ఉండటంతో..

వెంటనే మిడ్ మానేరుపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి పంపించాలని సర్కారు పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు కమిషన్‌కు చేరాయని సమాచారం. దీనితో ఆ నివేదిక దస్త్రం దుమ్ము దులిపి అంశాలవారీగా ఆరోపణలు, గుర్తించిన వాస్తవాలు, సిఫారసులతో లేఖను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.