21-08-2025 12:00:00 AM
ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తిన అధికారులు
నిజామాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మహారాష్ర్టలోని ఎగువ ప్రాంతం బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి, మహారాష్ర్టలో కురుస్తు న్న వర్షాల వల్ల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలోనే కందకుర్తి గోదావరి బ్రిడ్జి, పుష్కర ఘాట్లతోపాటు బా సర వద్ద గోదావరి నిండుకుండలా ప్రవహిస్తోంది.
ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా లోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తి నీటిని దిగువ కు విడుదల చేశారు. బుధవారం 2,07,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. ప్రాజెక్టు సామర్థ్యం 1,090 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 1,089 అడుగులకు పైగా చేరుకున్నది. నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలుకాగా ప్రస్తుత నీటిమట్టం 76 టీఎంసీ లకు చేరుకుంది. దీంతో 39 గేట్ల ద్వారా రెండు లక్షల 70 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్(విజయక్రాంతి): శ్రీశైలం నుంచి భారీగా వరద పోటెత్తడంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు మొత్తం 26 గేట్లు ఎత్తి దిగువకు వదులుదున్నారు. ఇన్ ఫ్లో 4,85,877 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,64,409 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 293.6854 టీఎంసీలుగా నమోదయింది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,414 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 2400 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది. నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.