21-08-2025 12:00:00 AM
-కాళేశ్వరం వద్ద 12 అడుగులకు నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
-భద్రాచలం వద్ద 4 అడుగులకు నీటి మట్టం.. రెండోప్రమాద హెచ్చరిక జారీ
- కాళేశ్వరం వద్ద నీట మునిగిన జ్ఞాన దీపాలు
జయశంకర్ భూపాలపల్లి(మహబూబాబాద్)/మహదేవపూర్(భూపాలపల్లి)/భద్రాచలం, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాలేశ్వరం వద్ద గోదావరికి వరద క్రమక్రమంగా పెరుగుతున్నది. కాలేశ్వరం వద్ద గోదావరి ఘాట్లు, సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన జ్ఞాన దీపాలు నీటిలో మునిగాయి.
బుధవారం ఉదయం 7 గంటలకు 12.220 అడుగులకు నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కలెక్టర్ రా హుల్ శర్మ జారీ చేశారు. బుధవారం ఎస్పీ కిరణ్‌తో కలిసి కాలేశ్వరం ఘాట్లను సందర్శించారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 9030 632608 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. నదిలోకి ఎవరిని దిగకుండా కట్టడి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అత్యవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలను తరలించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతంగా ప్రవ హిస్తున్నది. బుధవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు 43 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చ రికను జారీచేశారు. బుధవారం సాయంత్రానికి 46.60 అడుగులకు చేరుకొంది.
రాత్రి ౧౦ గంటలకు 48 అడుగులకు చేరుకోవడం తో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 46.60 అడుగులు చేరుకోవడంతో కరకట్ట వద్దగల గోదావరి స్నాన ఘట్టాలు, కేశఖండన బిల్డింగ్ పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో అధికారులు యాత్రికులు ఎవరిని స్నానం చేయటానికి అనుమతించడం లేదు.
అంతేకాకుండా వరద పెరగడంతో భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారిలో తూరుబాక వద్ద అప్రోచ్ రోడ్డుపై గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి రహదారి మునిగిపోయింది. భద్రాచలం నుంచి ఏపీ వైపు కూనవరం వెళ్లే రహదారిని సైతం మురుమూరు వద్ద గోదావరి వరద ముంచెత్తడంతో అటువైపు కూడా రహదారి బంద్ అయింది.
బోరుబావి నుంచి ఉబికి వస్తున్న నీరు
- మోటార్ నడవకుండానే పారుతున్న వైనం
నిజామాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలోని ఓ బోరుబావి నుంచి యంత్ర సహాయం లేకుండానే నీరు ఉబికి పైకి వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి బోరుకు సంబంధించిన సబ్‌మెర్సిబుల్ పంపును నడపనప్పటికీ బోర్ నుంచి నీరు ఉబికి వస్తున్నాయని రైతు నవీన్ తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండటంతో భూగర్భ జలాలు నిండుకున్నాయి. ఫలితంగా ఎడపల్లి మండలంలోని ధర్మారంలో బోరు నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి.