calender_icon.png 20 August, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లిలో జోరు వాన

20-08-2025 01:11:57 AM

-పలిమెల మండలంలో అత్యధికంగా 8.7 సె.మీ.ల వర్షం

-ములుగు జిల్లా కలువుపల్లిలో వాగులో చిక్కుకున్న నలుగురు.. 

-భద్రాచలం వద్ద 36.30 అడుగులకు గోదావరి నీటిమట్టం

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో సోమ వారం రాత్రి నుంచి మంగళవారం ఉద యం వరకు జోరు వాన కురిసింది. పలిమెల మండలంలో అత్యధికంగా 8.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. భూపాలపల్లిలో 5.7, కాటారంలో 4.5, మహా ముత్తారం మండలంలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగిలిన మండలాల్లో 2 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. మహాముత్తారం - యామనపల్లి, కేశవాపూర్ -పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిసు న్నది. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న అన్నారం సరస్వతి బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 67,356 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి

భద్రాచలం(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 36.30 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. సోమవారం రాత్రి 38.50 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం నాలుగు గంటల పాటు స్థిరంగా ఉండి మంగళవారం ఉదయం నుంచి తగ్గుతూ సాయంత్రానికి 36.30 అడుగులకు చేరుకున్నది. 

వరదలో చిక్కుకున్న నలుగురు

తాడ్వాయి(విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కలువుపల్లిలో సోమవారం పశువుల కాపరి  దుబా రి రామయ్య, మత్స్యకారులు సాయికిరణ్, రాజబాబు, రాములు.. వాగు ప్రవాహంలో చిక్కుకున్నారు. సోమవారం రాత్రి 11గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని తాడు సాయంతో వాగు దాటి రక్షించారు. 

వరద నీటిలో గురుకులం

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ పట్టణం శాంతినగర్‌లో అద్దె భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకులం సెల్లార్‌లోకి వదర నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు పాఠశాల విద్యార్థులను మంగళవారం ఇళ్లకు పంపించారు.

ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద 

కామారెడ్డి(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 18 అడుగులు (73.37 టీఎంసీలు) నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు 39 గేట్లు ఎత్తారు. ఈ గేట్ల ద్వారా 2,32,418 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

ఏడుపాయలలో తగ్గని వరద 

పాపన్నపేట: మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ ఆలయం నాలుగు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు సింగూరు నుంచి వరద భారీ స్థాయిలో వస్తుండటంతో ఘనపురం ప్రాజెక్టు పొంగి పొర్లుతున్నది. దీంతో వనదుర్గ ఆలయం చుట్టూ నీరు చేరడంతో ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.