20-08-2025 01:03:47 AM
గార్లలో పెండింగ్‌లో రూ. 75 లక్షలు
గార్ల, ఆగష్టు 19(విజయ క్రాంతి ): వేసవికాలంలో పొద్దంతా ఎండలో కష్టపడి పని చేస్తే చెల్లించాల్సిన కూలి డబ్బులు ఐదు నెలలు కావస్తున్న చెల్లించకపోవడంతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని 3000 మంది కూలీలు తమకు రావలసిన 75 లక్షల రూపాయల పెండింగ్ వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. వలసలు నివారించి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే కూలి పనులు చూపి కూలీలకు ఆర్ధిక కష్టాలు తీర్చేందుకు రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఉపాధి కూలీలకు ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
గార్ల మండలంలో 3000 మంది ఉపాధి కూలీలు గత వేసవిలో రెండు వారాలపాటు నిర్విరామంగా ఉపాధి పనులు నిర్వహించారు. అయితే వారికి ఐదు నెలలు కావస్తున్న కూలి పనుల డబ్బులు చెల్లించకపోవడం తో పాటు వేతనాలు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయో సమాధానం చెప్పేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న కూలి డబ్బులను తమ వ్యక్తిగత ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారో తెలియక నిత్యం పాసు పుస్తకాలు చేతపట్టుకొని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ఎప్పుడు చుసినా ఖాతాలో డబ్బులు జమ కాలేదని సమాధానం వస్తుండడంతో కూలీలు నిరాశకు లోనవుతున్నారు. చేసిన పనులకు కూలి సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపిస్తున్నారు. కూలి డబ్బులతోనే జీవనం సాగించే వ్యవసాయ ఆధారిత కూలీలు డబ్బులు ఇవ్వకపోవడంతో జాతీయ ఉపాధి హామీ పనులకు మళ్లీ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఎప్పటికప్పుడు కూలి డబ్బులు ఇస్తే తప్ప ఇంట్లో గడవని స్థితి ఉండగా, పనులు చేసి ఐదు నెలలు దాటుతున్న ఇవ్వకపోవడంతో, ఇతర ఉపాధి పనులకు మళ్లీ వలస బాట పట్టే పరిస్థితి గార్ల మండలంలో నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి, పనులు చేపట్టిన వెంటనే నమోదు చేసి, చెల్లింపులు చేస్తే తప్ప ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరే పరిస్థితి లేదు.
బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం
గార్ల మండలంలోని వివిధ గ్రామా ల్లో వేసవికాలంలో నిర్వహించిన జాతీయ ఉపాధి హామీ పథకంలో 3000 మంది కూలీలు పాల్గొన్నారు. సుమారు ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున 75 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది.
పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు వివరాలను ప్రభుత్వానికి ప్రతిపాదించాం. నిధులు మంజూరు కాగానే కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
సర్జన్ స్వరూప్, ఏపీఓ, గార్ల