calender_icon.png 20 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం కష్టాలు

20-08-2025 01:14:19 AM

-మెదక్ జిల్లా మక్కరాజ్‌పేటలో రైతు సేవా కేంద్రం వద్ద అర కిలోమీటర్ లైన్

-అయినా దొరకని బస్తాలు

-మహబూబాద్ జిల్లాలో కుటుంబ సభ్యులంతా క్యూలోనే..

-పలు ప్రాంతాల్లో రైతులతో కలిసి బీఆర్‌ఎస్ ధర్నాలు

మహబూబాబాద్/చేగుంట, ఆగస్టు 19 (విజయక్రాంతి): పొలం నాటు పెట్టి నెల రోజులవుతన్నా ఇప్పటివరకు ఒక్క యూరి యా బస్తా దొరకకపోవడంతో పంట ఎండిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందు తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మం గళవారం కేసముద్రం మండలం ఉప్పరపల్లి రైతు వేదిక వద్ద వందల మంది రైతులు క్యూ కట్టారు. 222బస్తాల యూరియా రావడం తో రైతులు ఇంతకు రెట్టింపు ఉండటంతో పట్టాపాస్ పుస్తకం ఉన్న రైతులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు.

మరో 222 మంది రైతులకు టోకెన్లు ఇచ్చి  పంపించారు. అలాగే కేసముద్రం సొసైటీ, కల్వల గ్రామాల్లో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్ పేటలోని శ్రీ ఆంజనేయ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం అర కిలోమీటర్ వరకు క్యూ కట్టారు. పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పట్టుకొని వర్షంలోనే క్యూలో నిలబడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేరుకొని వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. తక్షణమే అధికారులతో మాట్లాడి యూరియా సమస్యలు తీర్చాలని అన్నారు.  అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. 

క్యూలో నిల్చున్న కుటుంబ సభ్యులు

మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం కేసముద్రం మండలం ఉప్పరపల్లి రైతు వేదిక వద్ద జనిగల యాకస్వామి, భార్య హైమ, కొడుకు రాజేందర్, కోడలు క్యూ లో నిలబడ్డారు. ముగ్గురి పేర్లపై పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కరి ఒకటి చొప్పున మూడు బస్తాలే ఇచ్చారు. 

రైతులు, బీఆర్‌ఎస్ నేతల ధర్నా

సిద్దిపేట(విజయక్రాంతి)/దౌల్తాబాద్/హుజురాబాద్: రైతులకు అవసరమైనంత యూ రియా అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్‌రాజీవ్ రహదారిపై బిఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. నారాయణరావుపేట మండలంలోని బిఆర్‌ఎస్ నాయకులు సిద్దిపేట వేములవాడ రహదారిపై నిరసన వ్య క్తం చేశారు. మాయమాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులను ఇబ్బందుల గురి చేస్తుందని మండిపడ్డారు.  సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రం లో మంగళవారం శివాజీ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.  కరీంనగర్ జిల్లా హుజరాబాద్ డివిజన్ కేంద్రంలో మంగళవారం యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సైదాపూర్ మండలం లో సహకార సంఘం ముందు తెల్లవారుజామునే క్యూ కట్టారు. కేశవపట్నం మండలం తాడికల్, కరీంపేట  గ్రామాలలో బారులు తీరారు. తాడికల్ గ్రామంలో ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు చేరుకొని రైతులను శాంతింపజేశారు.

అధిక ధరలకు యూరియా అమ్మకం!

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రైవేటు ఎరువుల వ్యాపారి ఒకరు లారీ నిండా యూరియా తెచ్చి రాత్రికి రాత్రే అధికారులకు సమాచారం ఇవ్వకుండా అధిక ధరలకు అమ్ముకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహుల గూడెంలో జరిగింది. ఏవో యాస్మిన్ కథనం ప్రకారం.. నరసింహుల గూడెం స్టేజి వద్ద ఉన్న ఓ ఎరువుల షాపు యజమాని సోమవారం రాత్రి 333 బస్తాల యూరియా లోడ్ తెప్పించుకున్నాడు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రూ.280 రూపాయలకు విక్రయించాల్సిన యూరియా బస్తాలు ఒక్కోటి రూ.400 చొప్పున విక్రయించాడ. నెల రోజులపాటు షాప్ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నివేదిక ఇచ్చినట్లు ఏవో తెలిపారు.