13-09-2025 08:00:48 PM
రోడ్లన్నీ జలమయం..
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District)లో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో ఖమ్మంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు ఈ వరద నీరు ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటం, స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఖమ్మం పట్టణంలోని పాత బస్టాండ్, ఇల్లందు క్రాస్ రోడ్డు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు మోకాళ్ళ లోతు రోడ్లపై ప్రవహించాయి. శనివారం కావడంతో రోడ్లపై కొంత రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఖమ్మంలో వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో కార్పొరేషన్ సిబ్బంది రెయిన్ కోట్ లు వేసుకొని నీరు నిలువ ఉన్న ప్రదేశాల నుంచి నీరు వెళ్లే ఏర్పాటు చేశారు. కొద్దిపాటి వాన వచ్చిన ఖమ్మంలోని ప్రధాన రహదారులపై నీళ్లు నిలుస్తుంటే ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కనబడటం లేదా అని ఖమ్మం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.