24-07-2025 12:43:12 AM
మహబూబాబాద్/ములుగు, జూలై 23 (విజయ క్రాంతి): మహబూబాబాద్, ములు గు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుధవారం ఈ రెండు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మహ బూబాబాద్ జిల్లాలో పాకాల, మున్నేరు వాగుల వరద ఉధృతితో డోర్నకల్, గార్ల మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి.
జిల్లా వ్యాప్తంగా కేస ముద్రం మం డలంలో 103.2 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 937.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనితో జిల్లాలోని ప్రధాన జలాశయాలు జల కళ ను సంతరించుకున్నాయి.
భారీ వర్షాలకు పెద్దగా వరద వచ్చి చేరడంతో బయ్యారం పెద్ద చెరువు, తులారం ప్రాజెక్టు మత్తడి వస్తున్నాయి. కొత్తగూడ మండల కేంద్రాని కి సమీపంలోని వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన ఆగబోయిన నరేష్ వరదలో గల్లంత య్యాడు. ఆచూకీ కోసం పోలీస్, రెవెన్యూ యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లాలోవాజేడు మండలంలో భారీగా కురిసిన వర్షంతో చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం పరవ ళ్లు తొక్కుతోంది. బొగత జలపాతం వైపు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యాట కులను అనుమతించడం లేదు. వెంకటాపు రంలో అత్యధికంగా 30 సెంటీమీటర్లకుపైగా వర్ష పాతం నమో దైంది. ఏటూరు నాగారంలో 18.4, మం గపేటలో 15.8, అలుబాక(జెడ్) లో 14.9, గోవిందరావు పేటలో 12.3, వెంకటాపూర్లో 8.9, లక్ష్మీదేవి పేటలో 9.3, వాజేడులో 7.2, ములుగు మండలం మల్లంపల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
గోవిందరావుపేట మండ లంలోని పస్రా సమీపంలో ఉన్న గుండ్ల వాగు, జలగలంచ వాగు వరదతో పొంగి పొర్లుతున్నాయి. మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలోకి నీరు వచ్చింది. డ్రైనేజీలు లేక సైడ్ కాలువల నుంచి నీళ్లు సరిగ్గా వెళ్ళకపోయి కొన్ని రోజుల క్రితం వేసిన రోడ్డు సైడ్ పక్కన వేసిన తూములలో నుంచి కూడా నీళ్లు వెళ్ళక, పలు ఇళ్లల్లోకి వరద నీరు చేచేరింది.
మంగపేట మండలంలోని గంపోనిగూడెం వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న ఏటూరునాగారం-భద్రాచలం డబుల్ లేన్ అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి వరద ఉధృతికి గండిపడింది. రోడ్డు కింద ఉన్న 10 అడుగుల లోతైన భారీ సిమెంట్ మోరీలు బయటపడ్డాయి. వెంకటపురం మండలం లోని రాళ్లవాగు సమీపంలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి వరద నీటి ప్రవాహంతో కొట్టుకుపోయి ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది.