24-07-2025 12:43:56 AM
ఆందోల్ (సంగారెడ్డి), జూలై 23(విజయక్రాంతి): స్వయం సహాయక సంఘం మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం పుల్కల్ మండలం సింగూరు చౌరస్తాలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అందోల్ నియోజకవర్గం మహిళా శక్తి సంబరాలకు టీజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు నూతన వ్యాపార అవకాశాలను కల్పిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గం పరిధిలోని 9 మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.64.81 కోట్ల రాయితీ రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి, ఆర్డీవో పాండు, మహిళా సమా ఖ్య సభ్యులు, గ్రామ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.