07-01-2026 12:50:10 AM
అశ్వారావుపేట, జనవరి 6 (విజయక్రాంతి) : ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వల్ల ఎంత ఉపయోగం ఉందో వాహన చొడుకులకు అశ్వారావుపేట సి ఐ నాగరాజు మంగళవారం అవగాహన కల్పించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకొని అశ్వారావుపేట పట్టణంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ఎంత కీలకమో తెలియజేయడానికి భారీ హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అశ్వారావుపేట పట్టణ సెంటర్ నుంచి ప్రారంభమై, ప్రధాన వీధుల గుండా సాగుతూ భద్రాచలం రోడ్డులోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న పోలీసులు, యువకులు, వాహనదారులు హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రత నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.
హెల్మెట్ మీ ప్రాణ రక్షణ, ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం ప్రాణాలు కాపాడుకుందాం రోడ్డు భద్రత మన బాధ్యత వంటి నినాదాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ప్రాణ నష్టం ద్విచక్ర వాహనదారులకే జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల తల గాయాలతో ప్రాణాలు కోల్పోయే ఘటనలు అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తే ప్రమాద సమయంలో తలకి గాయాలు తగ్గి ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని వివరించారు.
ఎస్త్స్ర టి. యయాతి రాజు మాట్లాడుతూ, వాహనదారులు కేవలం హెల్మెట్ మాత్రమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, వేగ నియంత్రణ పాటించడం, సిగ్నల్స్ గౌరవించడం వంటి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట పోలీస్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.