calender_icon.png 24 May, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు ధర ఎక్కువ ఉండటం ప్రమాదకరం!

21-05-2025 12:00:00 AM

  1. టన్నుకు వెయ్యి తగ్గించేలా ఉత్పత్తి పెంచి, వ్యయం తగ్గించాలి

సింగరేణి సీఎండీ బలరామ్

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): సింగరేణి ప్రస్తుత బొగ్గు ధర దేశంలోని ఇతర బొగ్గు కంపెనీల కన్నా చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ధర బొగ్గు లభించేవైపు మొగ్గు చూపుతున్నారని, ఇది చాలా ప్రమాదకరమని సంస్థ సీఎండీ బలరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. కనుక కనీసం టన్ను బొగ్గుకు రూ.వెయ్యి తగ్గించేలా సింగరేణి వ్యాప్తంగా ఉత్పాదకత పెంచాలని, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని, ఇందుకు యువ అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సింగరేణి చరిత్రలో మొదటి సారిగా.. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ద్వితీయ, తృతీయశ్రేణి అధికారులైన మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు సుమారు 762 మందితో మం గళవారం సీఎండీ బలరామ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రానున్న మూడేండ్లలో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో యువ అధికారులు ఇప్పటి నుంచే సంస్థ ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యాపార విస్తరణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని, సంస్థ భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, ఈడీ సుభాని, జీఎంలు మనోహర్, రాజశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.