30-10-2025 12:00:00 AM
 
							ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1
గిల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
దుబాయి, అక్టోబర్ 29: వయసు మీద పడింది...ఫామ్‌లో లేడు...టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.. ఇక వన్డే ప్రపంచకప్ ఆడడం కష్టమే... ఇదీ భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై గత కొంతకాలంగా వినిపించిన మాటలు.. కానీ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తనతో క్రికెట్ ఆడే సత్తా ఉందని హిట్‌మ్యాన్ ఆటతోనే నిరూపించాడు. రెండో వన్డేలో సెంచరీ, తర్వాత చివరి వన్డేలో శతక్కొట్టి ఔరా అనిపించాడు.
మునుపటి హిట్‌మ్యాన్‌ను ఫ్యాన్స్‌కు మళ్ళీ గుర్తు చేశాడు. ఈ ప్రదర్శనతోనే ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా లేటు వయసులో వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఆసీస్ గడ్డపై అదరగొట్టడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభమన్ గిల్‌ను వెనక్కి నెట్టి మరీ టాప్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ నెంబర్ వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. కెరీర్‌లో 276 వన్డేలు ఆడిన తర్వాత అతను ఈ ఫీట్ అందుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి వన్డేలో నిరాశపరిచి నప్పటకీ రెండో వన్డేలో 73, మూడో వన్డేలో సెంచరీ చేశాడు. సిడ్నీ వేదికగా కోహ్లీతో కలిసి కీలక పార్టనర్‌షిప్‌తో భారత్‌కు వైట్ వాష్ పరాభవాన్ని తప్పించాడు.
మొత్తంగా 202 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ ఎంపికయ్యాడు. గత ఏడాది టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్ ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్‌కు ముందు టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ 2027 ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం ఫిట్‌నెస్‌పైనా పూర్తి ఫోకస్ పెట్టిన రోహిత్ ఇటీవలే 12 కేజీలు తగ్గి గతంలో కంటే స్లిమ్ అయ్యాడు.
కాగా ఈ సిరీస్‌లో రాణించడంతో ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకిన హిట్‌మ్యాన్ గిల్‌ను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్ళగా..ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. ఆప్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జడ్రాన్ (745) రెండోస్థానంలోనూ, పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానంలోనూ, డారిల్ మిఛెల్ ఐదో ర్యాంకులోనూ నిలిచాడు.
ఇక సిడ్నీ వన్డేలో హాఫ్ సెంచరీ చేసినప్పటకీ ఒక స్థానం దిగజారిన కోహ్లీ(725) ఆరో స్థానంలో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ ఒక స్థానం మెరుగై తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు. కాగా వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకులో నిలిచిన ఐదో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో సచిన్, ధోనీ, కోహ్లీ, గిల్ భారత్ తరపున ఈ ఫీట్ సాధించిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్(710) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏడో ర్యాంకులో నిలిచాడు. టాప్ జాబితాలో మరే భారత బౌలర్‌కూ చోటు దక్కలేదు. వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఆప్ధనిస్థాన్‌కే చెందిన అజ్మతుల్లా ఒమన్‌జాయ్ అగ్రస్థానంలో ఉండగా...భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 4 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకులో నిలిచాడు.