23-09-2025 01:13:27 PM
పెద్దవూర మండల కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతులపై హోంగార్డు దాడి..
చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్..
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. యూరియా కోసం రాత్రింబవళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదునుకు పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర రైతులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా, పెద్దవూర మండల కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద హోంగార్డు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నాడు.
మంగళవారం ఉదయం రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఉష్యా నాయక్ యూరియా కోసం క్యూ లైన్ లలో బారులు తీరిన రైతులను లైన్లో నిలబెట్టే క్రమంలో ఐదుగురు రైతులపై చెయ్యి చేసుకున్నాడు. రైతులపై చేయి చేసుకున్న హోంగార్డు ఊష్యా నాయక్ ను విధుల నుండి తొలగించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా పెద్దపూరలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. రైతుపై దాడి చేసిన కానిస్టేబుల్‍పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.