23-09-2025 02:42:52 PM
బ్రిడ్జిలు నిర్మాణ ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): నగరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ(MP DK Aruna), మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నని న్యూఢిల్లీలోని వారి కేంద్ర కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. మహబూబ్ నగర్ నగరం పరిధిలో ఉన్న రైల్వే గేట్ల వల్ల ఏర్పడే భారీ వాహనాల రద్దీ కారణంగా పౌరులకు అసౌకర్యం కలుగుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ కారణం ప్రజలు వారి నిత్య కార్యకలాపాలు అత్యవసర కార్యకలాపాలకు పెద్ద అడ్డంకి మారిందని, సరైన రోడ్డు రైలు విభజన లేకపోవడం వల్ల నగరం మొత్తం రద్దీగా ఉంటుందన్నారు. అనేక కిలోమీటర్ల వరకు తీవ్రస్థాయి ట్రాఫిక్ జాములు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయం వెళ్లే వారు వ్యాపారులకు రోజువారిగా అసౌకర్యం ఏర్పడుతుందని వారు మంత్రి దృష్టికి తీసుకుపోయారు. ఎక్కువ సమయం రైల్వే గేట్లు మూసి ఉండటం వల్ల అంబులెన్స్ అత్యవసరం ప్రయాణాలు సైతం ఆలస్యం అవుతుందని దీనివలన చాలా కాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు మంత్రికీ చెప్పారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వలన నగరంలో మొత్తం ప్రభావం చూపుతుంది అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే వెంటనే, అత్యవసరమైన తిరుమల దేవుని గుట్ట రైల్వే గేటు, బోయపల్లి రైల్వే గేటు, తిమ్మసానిపల్లి రైల్వే గేట్లలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలను (ROB ) 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరితగతిన నిర్మాణం చేయాలని మంత్రిని కోరారు. సద్దల గుండు, దివిటిపల్లిలో పాదాచారుల కోసం ఓవర్ బ్రిడ్జిలు(FOB) కూడా ఏర్పాటు చేయడం వలన ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి దృష్టికి తీసుకురాగా, నగరంలో 100% కేంద్ర నిధులతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలను, పాదాచారుల ఓవర్ బ్రిడ్జి(FOB)లను నిర్మించేందుకు మంత్రి సుముఖంగా స్పందించారని, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణాలు చేస్తామని ఎంపి, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్లు వారు తెలియజేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేక పనులకు శ్రీకారం చుట్టు ముందుకు సాగుతున్నామని వారు పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే తెలియజేసిన ప్రకారము ఈ ప్రాంతాలలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.