calender_icon.png 23 September, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి

23-09-2025 01:21:02 PM

జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ

గద్వాల: 2025-26 వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ(District Additional Collector Laxminarayana) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ రెండో వారంలో ప్రారంభించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, అవసరమైన గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు.

రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓ.పి.ఎం.ఎస్ లో నమోదు చేయాలని, అంతర్ రాష్ట్ర బోర్డర్స్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంలో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా కొనసాగించాలని సూచించారు.  ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.