07-07-2025 01:02:27 AM
- పిల్లల నుంచి వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మధిర, జూలై 6: రాజకీయాలకతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని, ప్రతి పేదవాడి సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో భట్టి విక్రమార్క పర్యటించి.. మధిర ట్యాంక్‌బండ్ వద్ద పర్యాటక సౌకర్యాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్‌లో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలకు చెందిన ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతిం టి కల సాకారం కావాలంటే ఇందిరమ్మ ప్ర భుత్వం రావాలని నమ్మి అవకాశం అందించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిమితితో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, టూరిజం ఎస్‌ఈ. సరిత, జిల్లా టూరిజం అధికారి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.