12-02-2025 12:27:43 AM
వికారాబాద్, ఫిబ్రవరి 11: అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇండ్ల మంజూరీకై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇల్లు నమూనా గృహానికి శాసనసభ సభాపతి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు.
ముందుగా రాష్ట్రంలోని అతి నిరుపేదలైన ప్రజలకు మొదటి విడతగా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో ప్రాధాన్యత క్రమంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందిస్తూ... ఇట్టి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
రెండో విడతలో బండలు కలిగి ఉన్న ఇండ్లను గుర్తించి అట్టివారికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. ఇండ్ల కోసం ఎంపిక చేసే లబ్ధిదారుల విషయం లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అర్హులైన వారిని ఎంపిక చేసి లబ్ధి చేకూరే విధంగా అధికారులు, నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సభాపతి సూచించారు. భూమి పూజ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ సుధీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణయ్య, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, పిఎసిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టిఏ సభ్యులు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.