విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
భీమిని, మే 11: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైన ఘటన భీమిని మండలం పెద్దపేట గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపేటకు చెందిన అరికిల్ల విజయ ఇంట్లో సోమ వారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
చుట్టు పక్కల ప్రజలు గమనించి బెల్లంపల్లి ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా, మంటలు ఎక్కువ కావడంతో పాటు ఎండవేడికి మంటలు అదుపు చేయలేకపోయారు. బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకొని బెల్లంపల్లి అగ్నిమాపక అధికారి ఆర్ సత్యనారాయణ, సిబ్బంది ప్రభాకర్, రమేష్, మహేష్ లు మంటలను ఆర్పారు. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో ఇల్లు బూడిద కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కుటుంబ అవసరాల కోసం ఎకరం భూమిని విక్రయించగా వచ్చిన రూ. 10 లక్షలు నూతనంగా నిర్మించే ఇంటికి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేయగా, మిగితా డబ్బుతో పాటు ఇంటి నిర్మాణం కోసం బంధువుల దగ్గర తీసుకొచ్చిన మరో రూ. 5 లక్షలు ఇంట్లో దాచిపెట్టగా పూర్తిగా కాలిపోయిందని బాధితులు రోధిస్తూ పేర్కొన్నారు. డబ్బులతో పాటు తులం బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇద్దరు కొడుకులకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, విలువైన భూముల పాసుపుస్తకాలు పూర్తిగా బూడిద అయ్యాయని బోరున విలపించారు. ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగ కాలిపోవడంతో కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిషన్ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.






